హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కులగణన సర్వేను సక్రమంగా చేయడం చేతకాని ప్రభుత్వం.. మంచి పాలన ఎలా అందిస్తుంది? అని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ కేపీ వివేకానందగౌడ్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సరార్ ఏది చేసినా తిరోగమనమేనని, అన్నింటా అభాసుపాలు అవుతున్నదని విమర్శించారు. రెండు నెలలపాటు రూ.200 కోట్లు వెచ్చించి చేపట్టిన సర్వేతో రెండు కోట్ల మంది బలహీనవర్గాల ప్రజలను అవమానించారని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార కులగణనపై తమ వైఫల్యాన్ని ఒప్పుకున్నారని చెప్పారు.
హైదరాబాద్ తెలంగాణభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో అనేక సంస్థలు, ప్రభుత్వాలు సర్వే చేశాయని, ఇంత ఘోరంగా ఎక్కడా, ఎవరూ విఫలం కాలేదని తెలిపారు. కూడికలు తీసివేతలతో కులాల జనాభాను కుట్రపూరితంగా తకువ చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల నుంచి వస్తున్న రీసర్వే డిమాండ్ వేరు.. ఇపుడు ప్రభుత్వం చెప్తున్నది వేరని పేర్కొన్నారు. ఏదో మళ్లీ నాలుగు పేజీలు సర్వేలో జోడించి మమ అనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తొలి నుంచి తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు, సవరించుకోనూలేదు.. అని మండిపడ్డారు.
డెడికేటేడ్ కమిషన్‌ను నిపుణులతో ఏర్పాటుచేసి రీసర్వే చేయాలని, అప్పుడే చట్టబద్ధత వస్తుందని చెప్పారు. ఆ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించి రీసర్వే చేస్తేనే న్యాయస్థానాల్లో నిలబడుతుందని తెలిపారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అసెంబ్లీ ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటుచేశారని విమర్శించారు. ఆ రోజు బీసీ రిజర్వేషన్లపై చట్టం చేస్తారనుకుంటే చేయలేదని, ఇపుడు చట్టబద్ధత గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ చావుదెబ్బ తప్పదని సర్వే రిపోర్టులు వచ్చాకే, ఎన్నికల వాయిదా కోసం రీసర్వే చేస్తామని చెప్పతారని వివేకానంద తెలిపారు.