హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డి రాచరిక పాలన నడుపుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, విప్ కేపీ వివేకానంద్‌గౌడ్ ధ్వజమెత్తారు. మూసీ ప్రాజెక్టు పేరిట వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు. ప్రజలు, పార్టీల అభిప్రాయాలకు విరుద్ధంగా 27 శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారని దుయ్యబట్టారు. మేయర్, జీహెచ్ఎంసీ ముఖ్య అధికారులకు తెలియకుండానే గ్రేటర్ హైదరాబాద్‌ను 300 డివిజన్లుగా విభజించారని విరుచుకుపడ్డారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మేడ్చల్, చేవెళ్ల నియోజకవర్గాల్లోని గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేసి అక్కడి ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి మొదటి నుంచి హైదరాబాద్ నగరం అంటే చిన్నచూపని ఆరోపించారు. నగర పరిధిలో కాంగ్రెస్ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదనే అక్కసుతో నగరవాసుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో జీరో అవర్‌ను జీరో ఆన్సర్‌గా మార్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు, కేటీఆర్ మాట్లాడుతుండగా.. మంత్రులందరూ మూకుమ్మడిగా అడ్డుకోవడమేమిటని నిలదీశారు. సభ లో వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరుడు కేవలం 16 రోజులే శాసనసభ సమావేశాలు నిర్వహించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మందుల్లేక, సిబ్బందిలేక ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు.