హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇచ్చిన జడ్జిమెంట్‌ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అసెంబ్లీలో ఆ పార్టీ విప్ కేపీ వివేకానందగౌడ్ తెలిపారు. ఈ తీర్పు చాలా దారుణమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తే లేదని, న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బుధవారం స్పీకర్ తన తీర్పు ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద, కే సంజయ్ స్పీకర్‌ను కలిసి ఆ జడ్జ్జిమెంట్ తాలూకు ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరారు. అందుకు స్పీకర్ స్పందించలేదు.
అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేపీ వివేకానంద మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపుపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ట్రిబ్యునల్ చైర్మన్‌గా స్పీకర్ విఫలమయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఏమీకాదంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే ఇప్పుడు స్పీకర్ తన జడ్జిమెంట్‌లో చెప్పారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేల్లో ఇప్పు డు ఐదుగురికి సంబంధించిన జడ్జిమెంట్ మాత్రమే ఇచ్చి, మిగిలిన వారి జడ్జిమెంట్ ఎందుకు పక్కనపెట్టారని తాము ప్రశ్నించినప్పటికీ, స్పీకర్ నుంచి సరైన సమాధానం రాలేదని తెలిపారు. ప్రొసీడింగ్స్‌ను సాగదీస్తే చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో నోటీసులు ఇచ్చినప్పటికీ వారు స్పందించలేదని, కాబట్టి వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు నవ్వుకుంటున్నారు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ వెల్లడించిన తీర్పును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేపీ వివేకానంద పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థుల విజయానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు బాహాటంగా ప్రచారం చేశారని తెలిపారు. పార్టీ ఫిరాయింపుపై ఇచ్చిన పిటిషన్‌ను ఏ సందర్భంలో డిస్మిస్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ ం పరిహాసం: సంజయ్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిహాసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే సంజయ్ విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి జడ్జిమెంట్ ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదంటూ స్పీకర్ వైఖరిని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగమన్నా, సుప్రీంకోర్టు తీర్పులన్నా విలువలేకుండా పోయిందన్నారు. స్పీకర్ తీర్పును బీఆర్ఎస్ తరఫున వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.