హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయింపుల అంశంపై గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఆ 10 మంది ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డికి ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత సోమ భరత్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
పార్టీ మారగానే ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వాన్ని కోల్పోయే విధంగా చట్టం తెస్తామని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాంచ్‌న్యాయ్ సూత్రాల్లో ఇదొకటి అని గుర్తుచేశారు. తమ మ్యానిఫెస్టోపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా రాహుల్ చొరవ చూపించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు వరకు ఆగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమ బీఆర్ఎస్ పార్టీ తొలి విజయంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మూడు నెలల్లో అమలు చేయకపోతే కోర్టు దిక్కరణ కేసు అవుతుందని బీఆర్ఎస్ నేత సోమ భరత్‌కుమార్ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని, ఇప్పుడు మాత్రం ఈ విషయంలో సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. ఈ చట్టాన్ని కాంగ్రెస్ అమలు చేయకపోవడం వల్లే 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.