హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణభవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ భూముల్లో అవకతవకలపై ఇప్పటికే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలను బయటపెట్టారని పేర్కొన్నారు. కేటీఆర్ ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు సమాధానాలు చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఈ భూముల వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భూముల అంశంలో చర్చకు రమ్మని పిలుస్తున్నారని, వచ్చేందుకు తామూ సిద్ధమని, వెంట సీఎంను కూడా తీసుకురావాలని డిమాండ్ చేశారు. రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చి కాంట్రాక్టర్ల జేబులో పెట్టారని, అన్నదాతలకు రైతుభరోసా ఎందుకు పడలేదో పీసీసీ చీఫ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూపర్ సీఎంగా అవతరించారని విమర్శించారు.
ఆమె సీఎం రేవంత్‌రెడ్డి తప్పులను సమర్థిస్తున్నారా? లేక సరి చేస్తున్నారా ? అని సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఆస్తులను కాపాడితే, సీఎం రేవంత్ వాటిని అన్యాక్రాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ప్రెస్‌మీట్ కేవలం ట్రైలర్ మాత్రమే అని, మరిన్ని వివరాలు బయట పెడతామని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ పేరు కూడా త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, కిశోర్ గౌడ్, తుంగ బాలు పాల్గొన్నారు.