కొమురవెల్లి, అక్టోబర్ 28 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం కిష్టంపేటకు చెందిన కొయ్యడ ఎల్లయ్య అనుమానాస్పద స్థితిలో సౌదీ అరేబియాలో మృతిచెందాడు. గ్రామస్థులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. ఎల్లయ్య బతుకుదెరువు కోసం 2024 ఏప్రిల్లో సౌదీ వెళ్లిన ఎల్లయ్య ఈ నెల 25న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. 27న ఎల్లయ్య మృతిచెందినట్టు ఓ తెలుగు వ్యక్తి సమాచారం అందించాడు. ఎల్ల య్య పనిచేసే జిద్దా రియాదర్ ప్రాంతంలోని ఆల్పాద కంపెనీలో గతంలో నలుగురు కార్మికులు సైతం అనుమానాస్పదంగా మృతిచెందినట్టు సమాచారం.
రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడి న భర్త మృతిచెందిన వార్త నమ్మశక్యం గా లేదని భార్య కవిత, కుమారులు చెప్పారు. ఎల్లయ్య పెద్ద కుమారుడు కమలాకర్ కొమురవెల్లి చెరువు కట్టపై గతంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందాడు. తాజాగా ఎల్లయ్య మృతిచెందడంతో కుటుంబంలో వి షాదం అలుముకున్నది. ఎల్లయ్య మృతదేహాన్ని గ్రామానికి తెప్పించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కుటుంబీకులు, గ్రామస్థులు కోరుతున్నారు.