Kova Laxmi | రైతులకు యూరియా కొరత పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, వైఫల్యంపై ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మండిపడ్డారు. ఆసిఫాబాద్ రైతన్నలకు యూరియా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ, రైతుల పక్షాన ఆసిఫాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డికి కండ్లకు కనపడటం లేదా, చెవులకు వినపడటం లేదా అని ప్రశ్నించారు. నీకు పరిపాలన చేతకాకపొతే సీఎం పదవికి రాజీనామా చెయ్ అని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రైతు కూడా యూరియా కోసం ఇబ్బంది పడలేదని కోవ లక్ష్మీ గుర్తుచేశారు. రైతులకు 24గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ పాలన చేస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను పీడిస్తూ గద్దెనెక్కి కూర్చున్న రేవంత్, మంత్రులు దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆనాటి రోజులు తెస్తా అని చెప్పి యూరియా కోసం లైన్లో చెప్పులు పెట్టే దుర్మార్గపు పాలన తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల గోస మీకు కనిపిస్తలేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాలు రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని, పంటలకు అత్యవసరమైన యూరియాను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
యూరియా కోసం రైతుల పక్షాన మేము పోరాటానికి సిద్ధం
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిరైతులకు యూరియా కొరత పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, వైఫల్యంపై ద్వజమెత్తిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ రైతన్నలకు యూరియా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని… pic.twitter.com/RmyfOBPGar
— BRS Party (@BRSparty) August 25, 2025
యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని కోవ లక్ష్మీ అన్నారు. ఒకవైపు వర్షాలు వస్తున్నాయి.. కానీ మరోవైపు పంటలకు ఎరువులు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కేంద్రం యూరియా సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా నిల్వలు లేవని చేతులెత్తేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే దొందు దొందే.. ఈ డబుల్ గేమ్ ఆపాలని సూచించారు. అధికారులు, మంత్రులు స్పందించి, ఎక్కడి నుంచైనా యూరియాను వెంటనే తెప్పించి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. రైతుల పక్షాన నిలిచి, రైతుల సమస్య పరిష్కారమయ్యే వరకు నా పోరాటం కొనసాగిస్తానని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు వార్నింగ్ ఇచ్చారు.