పాల్వంచ, మార్చి 26 : ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి చైర్మన్ ఎంపికలో ఇద్దరి మధ్య వర్గపోరు బయటపడింది. పాల్వంచ మండలం జగన్నాథపురం, కేశవాపురం గ్రామాల మధ్య ఉన్న కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయ కమిటీని ఏటా ఎన్నుకుంటారు. గతంలో చైర్మన్, సభ్యుల ఎంపిక ఎలాంటి విభేదాలు లేకుండా కొనసాగింది. ప్రస్తుతం చైర్మన్ ఎంపికలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. భట్టి అనుచరులతో కూడిన ఆలయ ధర్మకర్తల బోర్డును ఏర్పాటు చేస్తూ మార్చి 6వ తేదీన జారీ చేసిన జీవోను పొంగులేటి ఒత్తిడితో రద్దు చేసినట్టు సమాచారం.
భట్టి అనుచరుడు జమ్ముల రాజశేఖర్ సహా మరో 13మందిని పెద్దమ్మగుడి ట్రస్టీల బోర్డుగా నియమిస్తూ జీవో నంబర్ 66 జారీ చేసింది. మంత్రి పొంగులేటి తన అనుచరుడిని ఆలయ చైర్మన్‌గా నియమించాలని కోరడంతో జీవోను పక్షంరోజులపాటు నిలిపివేశారు. మార్చి 19వ తేదీన ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ జీవో 66ను రద్దు చేసి జీవో 112ను జారీ చేశారు. తాజా జీవోలో జమ్ముల రాజశేఖర్ పేరు తొలగించి బాలినేని నాగేశ్వరరావు పేరుతో భర్తీ చేశారు. బాలినేని పేరును ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని ప్రతిపాదించారు. ట్రస్టీల బోర్డు జాబితాలో ఉన్న ఏడుగురి పేర్లను అలానే ఉంచారు. ఈ పరిణామం భట్టి వర్గీయులను కలవరానికి గురిచేసింది. దీనిపై ఆలయ ఈవో రజనీకుమారిని ‘నమస్తే’ వివరణ కోరగా… రెండో జీవో ఈ నెల 19వ తేదీన విడుదలైందని, దానిప్రకారమే ప్రమాణం స్వీకారం చేస్తారని, తేదీ ఖరారు కాలేదని తెలిపారు.
పెద్దమ్మతల్లి ఆలయ కమిటీలో తమకు సముచితస్థానం లభించలేదని కేశవాపురం, జగన్నాథపురం ప్రజలు బుధవారం ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసేందుకు రాగా ఆ గ్రామాల ప్రజలు ఆలయం వద్దకు చేరుకున్నారు. స్థానికేతరులు, అనుభవంలేని వారికి కమిటీలో స్థానం కల్పించొద్దని నినాదాలు చేశారు. ఇద్దరు యువకులు పక్కనే ఉన్న వాటర్‌ట్యాంక్ ఎక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొందరు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. పాల్వంచ సీఐ, ఎస్ఐలు ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పారు.