కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. అభ్యర్థులను ప్రకటించకముందే ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. సాధారణంగా పార్టీల్లో అభ్యర్థులను ప్రకటించాక అసంతృప్త నేతలు బయటకి రావడం సహజం, కానీ కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) కార్యదక్షత, పనితీరుతో దానికి భిన్నంగా బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ప్రచారం జరుగుతున్న కొత్త జయపాల్ రెడ్డి(Kotha Jaipal Reddy), కరీంనగర్ అభ్యర్థిని ఖరారు చేయడానికి ముందే ఆ పార్టీని వదిలేసి బీఆర్ఎస్లో చేరారు.
దీంతోపాటు కరీంనగర్ కార్పొరేషన్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు మర్రి భావన, కచ్చు రవి, బీజేపీ నేత మర్రి సతీష్ ఇతర శ్రేణులు సైతం గులాబీ జెండాను చేతపట్టి ఎన్నికల రణక్షేత్రంలో దిగారు. తాజాగా మంత్రి గంగుల వారిని తీసుకొని బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.
బీఆర్ఎస్లో చేరిన వారితో మంత్రి గంగుల కమలాకర్
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు రాబోయే రోజుల్లో కరీంనగర్ అభివృద్దిలో పాలుపంచుకోవడానికి తమ శాయశక్తులా కృషిచేస్తామని నేతలు తెలిపారు.