హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి రూ.993 పెంచడం దుర్మార్గమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. పశ్చిమబెంగాల్ ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచిందని విమర్శించారు. ధరలు పెంచమంటూనే ఎన్నికలు పూర్తవగానే ధరలు పెంచడమేంటని ప్రశ్నించారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు కొప్పుల శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం ప్రజలపై యుద్ధం ప్రకటించడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ కమర్షియల్ సిలిండర్ ధరను 2026 మార్చిలో రూ. 115, ఏప్రిల్లో రూ.195 పెంచిన కేంద్రం, ఇప్పుడు ఒకసారిగా రూ.993 పెంచిందని పేర్కొన్నారు.
గత రెండు నెలల్లోనే మొత్తం రూ. 1,303 భారాన్ని ప్రజలపై మోపడం అత్యంత దారుణమని మండిపడ్డారు. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు పూర్తవగానే గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ చర్యను కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.