న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశీయ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు దూసుకుపోతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు 11 రెట్లు పెరిగి రూ.4.24 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రంగా భాసిల్లుతున్న భారత్..అంతక్రితం ఏడాది రూ.2.59 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ ఎలక్ట్రానిక్స్ పరికరాలకు పెరుగుతున్న డిమాండ్ ఇందుకు కారణమని విశ్లేషించింది. ఈ రంగంలో 12 లక్షల మంది ఉపాధి పొందుతుండగా, వీరిలో 30 శాతం మంది మహిళలు ఉండటం విశేషం. దేశ జీడీపీలో 14 శాతం వాటా కలిగిన ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ స్కీమ్‌ను తీసుకొచ్చింది.
వీటితోపాటు ఎలక్ట్రానిక్స్ కంపొనెంట్ తయారీ స్కీమ్, ఇండియా సెమికండక్టర్ మిషన్లను ప్రవేశపెట్టింది. 2024-25లో 47.96 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతి అయ్యాయి. గత నాలుగేండ్లలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.38 వేల కోట్ల నుంచి రూ.4.24 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశీయ ఫోన్ల తయారీలో 2014-15లో 153వ స్థానంలో ఉన్న భారత్..2025-26లో మాత్రం రెండో స్థానానికి ఎగబాకినట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తి కూడా 2014-15లో రూ.18 వేల కోట్లుగా ఉండగా, గతేడాది మాత్రం రూ.6.27 లక్షల కోట్లకు చేరకున్నాయి. ఇదే సమయంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు రూ.1,500 కోట్లు ఉండగా, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 165 రెట్లు పెరిగి రూ.2.59 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ రంగంలో 12 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తుండగా, దీంట్లో 30 శాతం మంది మహిళలే ఉండటం విశేషం.
డిజిటల్ కనెక్టివిటీలో..
దేశవ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీ భారీగా పెరిగింది. 2014లో 25.15 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ సబ్‌స్ర్కైబర్లు..మార్చి 2026 నాటికి 109.2 కోట్లకు చేరుకున్నారు. ఇదే సమయంలో వైర్లెస్ డాటా వినిమయం జీబీ కోసం రూ.308 వెచ్చించాల్సివుండగా, ప్రస్తుతం ఇది రూ.7.51 తగ్గినట్టు పేర్కొన్నది. దీంతో డిజిటల్ సర్వీసెస్ మరింత చౌకగా లభిస్తున్నాయి. అలాగే సరాసరిగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ కూడా 13.67 శాతం నుంచి 132.00 కి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 99.9 శాతం నగరాల్లో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు.