సిటీబ్యూరో, ఆగస్ట్ 15 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌కు చెందిన 75 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం పేరిట మెసేజ్ వచ్చింది. మొదట చిన్నచిన్న టాస్క్‌లతో కొంత డబ్బు ఇచ్చి సైబర్‌నేరగాళ్లు ఆ ఉద్యోగంపై నమ్మకం కుదిర్చారు. ఆ తర్వాత టెలిగ్రామ్ యాప్‌లో చేర్చి ఫారిన్ ఎక్సేంజ్ ట్రేడింగ్ పేరిట ఆశ చూపారు. స్క్రీన్‌పై నకిలీ లాభాలు చూపిస్తూ విత్ డ్రా, ప్రాసెసింగ్ చార్జీల పేరుతో ఆయన వద్ద నుంచి విడుతల వారీగా రూ. 96లక్షలు కొల్లగొట్టారు.
70 సంవత్సరాల వయసు కలిగిన రిటైర్డ్ గెజిటెడ్ అధికారికి ఒక కేటుగాడు వాట్సాప్ వీడియోకాల్ చేసి ముంబైకి చెందిన పోలీసు అధికారి అనూప్శర్మగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడిపై మనీలాండరింగ్ కేసు నమోదైందని, వెంటనే అరెస్ట్ చేస్తామంటూ నకిలీ పత్రాలతో భయాందోళనకు గురిచేశాడు. బ్యాంక్ ఖాతాల తనిఖీల పేరుతో ఒకే ఆర్టీజీఎస్ లావాదేవీ ద్వారా బాధితుడి నుంచి రూ.85లక్షలు గుంజేశాడు. ఇలా నగరానికి చెందిన ఎంతోమంది సీనియర్ సిటిజన్లు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. సిటీ కమిషనరేట్ పరిధిలో సీనియర్ సిటిజన్లను ప్రధానంగా ట్రేడింగ్ మోసాలు, ఓటీపీలు, పెట్టుబడుల మోసాల ద్వారా నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు.
వృద్ధులే టార్గెట్..
నగర సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో 19నెలల కాలంలో జనవరి 2025 నుంచి జూలై 2026 వరకు నమోదైన గణాంకాలను పరిశీలిస్తే సైబర్ ముఠాలు ఏ స్థాయిలో వృద్ధులను ముంచెత్తుతున్నాయో తెలుస్తోంది. అరవై ఏండ్లు దాటిన వయోధికులకు సంబంధించి ఏకంగా 403 కేసులు నమోదు కాగా, బాధితులు కోల్పోయిన మొత్తం రూ.102.02 కోట్లుగా పోలీసులు చెప్పారు. వీటిలో అత్యధికంగా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నవి ట్రేడింగ్ మోసాలని, 113 ట్రేడింగ్ ఫ్రాడ్ కేసుల్లో వృద్ధులు ఏకంగా రూ.55.88 కోట్లకు పైగా సొమ్మును కోల్పోయారని వారు పేర్కొన్నారు.
ఆ తర్వాత డిజిటల్ అరెస్టు మోసాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి 69 కేసుల్లో సీనియర్ సిటిజన్లు రూ.31.93 కోట్లకు పైగా పోగొట్టుకున్నారు. మూడో రకమైన ఓటీపీ మోసాల్లో అత్యధికంగా 115 కేసులు నమోదు కాగా అందులో వృద్ధులు రూ.4.94 కోట్లు మోసపోయారని సైబర్ పోలీసులు తెలిపారు. వీటితో పాటు ఆకర్షణీయమైన వడ్డీల ఆశ చూపే ఇన్వెస్ట్మెంట్ మోసాలకు సంబంధించి 22 కేసులు నమోదు కాగా అందులో బాధితులు రూ.2.79 కోట్లు నష్టపోయారని వారు చెప్పారు. సీనియర్ సిటిజన్లపై జరిగే మోసాల్లో డేటింగ్ ఫ్రాడ్స్, హనీట్రాప్స్ కూడా ఆందోళన కలిగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. గడిచిన 19నెలల్లో ఈ తరహా భావోద్వేగ మోసాలకు సంబంధించి 7 కేసుల్లో బాధితులు రూ.70.11లక్షలకు పైగా మోసపోయారు.
దర్యాప్తులో ఆసక్తికర అంశాలు..
సీనియర్ సిటిజన్స్ సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తులో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. వృద్ధుల విషయంలో కుటుంబసభ్యులు, పిల్లల పర్యవేక్షణ కొరవడుతున్నదని తేలింది. బిజీ జీవితం నెపంతో తల్లిదండ్రులు ఎలాంటి బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తున్నారు.. వారు ఫోన్లను ఉపయోగించే క్రమంలో సక్రమంగానే ఉపయోగిస్తున్నారా.. వారు ఎందు కు ముభావంగా ఉంటున్నారు లేదా భయాందోళనతో ఉంటున్నారనే విషయాలను పిల్లలు కనీసం అడగడం లేదని పోలీసులు వెల్లడించారు.
తమ తల్లిదండ్రులు మోసపోయిన తర్వాత సైబర్‌క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వస్తున్నారని, ఇప్పటికైనా సీనియర్ సిటిజన్స్ ప్రవర్తనలో ఏదైనా మార్పులు వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే వారిని సంప్రదించి ఒకవేళ మోసపోయినట్లు తెలిస్తే పోలీసులను సంప్రదించాలని నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఇటీవల సైబర్ నేరాలపై స్వీయఅవగాహన పెరుగుతుండడం సంతోషించాల్సిన విషయమే అయినా ప్రతీ ఒక్కరూ తమ లావాదేవీలపై పరిమితులు విధించాలను స్వయంగా బ్యాంకర్లను కోరాలని, సైబర్ నేరాలపై ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించాలని సజ్జనార్ సూచించారు.