పెద్దపల్లి, జూలై 6 (నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి కమాన్ : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లెత్తిపోయలేక సీఎం, మంత్రులు పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్లెత్తిపోస్తే భద్రాచలం కొట్టుకుపోతుందనడం సిగ్గుచేటని అన్నారు. కాళేశ్వరం ద్వారా పంట పొలాలకు నీళ్లిస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో పాజెక్టుపై ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. వర్షాలు లేక రైతులు తండ్లాడుతుంటే.. కేసీఆర్‌పై కక్షతోనే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు. సోమవారం పెద్దపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధూకర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్, మాజీ జడ్పీటీసీ రాములుతో కలిసి కొప్పుల మీడియాతో మాట్లాడారు.