కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 16 : అంకెల గారడీతో రాష్ట్ర రైతాంగాన్ని సీఎం రేవంత్రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్లోని ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు పాలనను తూర్పారబట్టారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ(Farmer loan waiver) అంటూ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ( Congress )ఓట్ల కోసం అలవికాని హామీలిచ్చిందని మండిపడ్డారు. అబద్ధాలతో అధికారం దక్కించుకుని, అవే అబద్ధాలతో రాష్ట్రంలో పరిపాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు.
రుణమాఫీపై ఆ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదని, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తలోమాట మాట్లాడుతుండడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఒకేసారి ఏకమొత్తంగా రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించి, అనంతరం విడుతల వారీగా చేస్తామని, తాజాగా కేవలం 55 నుంచి 60 శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ చేయడం ప్రభుత్వ దగాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. వందశాతం రుణమాఫీ చేస్తామంటూ గుళ్లలో ఒట్లేసి చెప్పిన సీఎం రేవంత్, దేవుళ్ళను కూడా మోసం చేశాడని విమర్శించారు.
2014లో తమ ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ కింద రూ.16,144కోట్లు విడుదల చేసి, 35 లక్షల మందికి లబ్ధి చేకూర్చిందని గుర్తు చేశారు. 2018లో కేవలం రూ.లక్ష లోపు రాష్ట్రంలో 37 లక్షల మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల్లోపు రుణమాఫీ 23.75 లక్షల మందికి వర్తింపజేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అడ్డగోలు కోతలతో 40 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టి, వారి కడుపులు కొట్టిందని మండిపడ్డారు.
కౌలు రైతులకు అందిస్తామన్న సాయం కూడా అటకెక్కిందని, రైతుబంధు ఎగ్గొట్టి వారిని నట్టేట ముంచిన కాంగ్రెస్ సర్కారు రూ.రెండు లక్షల రుణమాఫీ చేసినట్లు చెప్పుకోవడం అత్యంత హేయనీయమన్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ పరిపాలన చేతకాక, బీఆర్ఎస్పై నమ్మశక్యం కానీ వ్యాఖ్యలు చేస్తోందని దుమ్మెత్తి పోశారు. ప్రజలకిచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసే దాకా రాష్ట్ర ప్రభుత్వం వెంటపడుతామని, వేటాడుతామని స్పష్టం చేశారు.