జగిత్యాల : రాష్ట్రంలో కేసీఆర్(KCR) పేరు వినిపించినా, కనిపించినా కాంగ్రెస్ పార్టీకి కలవరం మొదలవుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )అన్నారు. ఆదివారం జిల్లాలోని ధర్మపురి మైనారిటీ గురుకుల కళాశాలలో రెండు రోజుల క్రితం ఆహారం వికటించి అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించడానికి ఆయన కళాశాలకు వెళ్లారు. కాగా, మాజీ మంత్రి కొప్పులను కళాశాల లోనికి ప్రినిపాల్ అనుమతించలేదు. కళాశాలలోకి ఎవరిని అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని, అందుకే అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కళాశాల గేటు బయట విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయాలని కాంగ్రెస్ సర్కార్ విశ్వప్రయత్నం చేస్తున్నద మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మైనారిటీ కళాశాలలోకి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ చరిత్రను రూపు మాపలేరన్నారు. పరి పాలన చేతకాక తప్పుడు కేసులు పెడుతూ బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.