హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కాళేశ్వరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కోసం తీసుకొచ్చిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కిస్తీలు చెల్లించడం లేదని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ రైతులు సాగునీటి కోసం పడిన గోసను చూసి కేసీఆర్ తల్లడిల్లిపోయారని, వారి బాధలు తీర్చేందుకు కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని గుర్తుచేశారు.
మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం కూలిపోయినట్టు ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. నీటిని ఎత్తిపోయకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా రైతులను ఏడిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ మొదటి నుంచి అడ్డుపడుతున్నదని పేర్కొన్నారు. కుంగిన పిల్లర్లకు ఉచితంగా మరమ్మతులు చేస్తామని ప్రభుత్వానికి ఎల్అండ్టీ లేఖ రాసినా, సుప్రీంకోర్టు ఆదేశించినా లెక్క చేయకపోవడం వెనక ఏదో కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తంచేశారు. కాళేశ్వరాన్ని బాగుచేసి తిరిగి వినియోగంలోకి తీసుకురాకుంటే తిరిగి పాత రోజులే వస్తాయని హెచ్చరించారు.