హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తాడిచర్ల బ్లాక్ 2ను సింగరేణికి కేటాయించామంటూ బీజేపీ, కాంగ్రెస్ కొత్త నాటకానికి తెర తీశాయని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సింగరేణిలో అక్రమాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమారలను కాపాడేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తాడిచర్ల ప్రకటన చేశారనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. గనులను టెండర్ల ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే దుర్మార్గానికి తెరతీసిన పాపం కాంగ్రెస్, బీజేపీలదేనని ధ్వజమెత్తారు. ‘బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొంటేనే గనులు దకుతాయని సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార పదేపదే చెప్పారు. కేంద్ర మంత్రులు కూడా ఇదే ప్రచారం చేశారు. కానీ, వేలం లేకుండా సింగరేణి అనుభవం ఆధారంగా గనులు కేటాయించాలని నిరంతరం పోరాడింది బీఆర్ఎస్, టీబీజీకేఎస్ మాత్రమే‘ అని స్పష్టంచేశారు. బొగ్గు గనులపై, జీఎం కార్యాలయా ల ఎదుట నల్లబ్యాడ్జీలతో తాము చేసిన పోరాటాల ఫలితంగానే నేడు కేంద్రం దిగివచ్చి తాడిచర్ల బ్లాక్‌ను కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తాడిచర్ల బ్లాక్-2 మాత్రమే కాకుండా.. తెలంగాణలోని మిగిలిన అన్ని బొగ్గు బ్లాక్‌లను వేలం లేకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని కార్మికుల పక్షాన డిమాండ్ చేశారు.
గుజరాత్‌కు దోచిపెట్టారు
తెలంగాణ సొమ్మును గుజరాత్ వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం దోచిపెట్టిందని కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో గురుకులాలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు నాణ్యమైన బోధనతోపాటు, పౌష్టికాహారం, సౌకర్యాలు కల్పించిందని తెలిపారు.