హైదరాబాద్, అక్టోబరు 8 (నమస్తే తెలంగాణ) : కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంతోనే హర్యానాలో కాంగ్రెస్ ఏడు గ్యారెంటీలను ప్రజలు విశ్వసించలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మోసం ఎప్పుడూ చెల్లదని, ప్రజలు చాలా తెలివైన వారని కొప్పుల పేర్కొన్నారు.
తప్పుడు వాగ్దానాలతో ఒకసారి గెలుపొందవచ్చేమో కానీ మరోసారి గెలువలేరని, అందుకు హర్యానా ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే లాబీయింగ్, పైరవీలు, సొంత ఎజెండా, నాయకుల అభివృద్ధి అని, ప్రజల అభివృద్ధిపై దృష్టి పెట్టదని ఎద్దేవా చేశారు. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణలా హర్యానా ప్రజలు మోసపోలేదని, కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టినట్టు ఫలితాలు ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీసే సమయం త్వరలోనే రానున్నట్టు కొప్పుల తెలిపారు.