వేములవాడ, జూన్ 8: వేములవాడ రాజ న్న ఆలయ గోశాలలో కోడెల మృత్యుఘోషకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. తిప్పాపూర్లోని రాజన్న ఆలయానికి చెందిన గోశాలలో ఇప్పటివరకు అధికారిక లెకల ప్రకారం 33 కోడెలు మృతిచెందిన విషయాన్ని గుర్తుచేశా రు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ నాయకుల తో కలిసి గోశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ.. గోశాలలో సామర్థ్యానికి మించి కోడెలు ఉండటం, సరైన మేత అందించకపోవడం తదితర సమస్యలతో నిత్యం కోడెలు మృత్యువాత పడుతున్నాయ ని ఆందోళన వ్యక్తంచేశారు. నిబంధనల ప్రకా రం కోడెలను రైతులకు పంపిణీ చేయకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిఫారసు లేఖ ద్వారా గీసుకొండకు చెందిన రాంబాబు అక్రమ పద్ధతిలో 60 కోడెలను ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అందులో 49 కోడెలు మాయమయ్యాయ న్నారు. మంత్రి కొం డా సురేఖ నిర్వాకం వల్లే కోడెల పంపిణీ ఆరు నెలలుగా నిలిచిపోయిందని ఆరోపించారు.