హైదరాబాద్, నవంబర్ 7(నమస్తేతెలంగాణ): యాదగిరిగుట్ట ఆలయాన్ని దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. దేశంలో ఎత్తయిన స్వర్ణగోపురం యాదగిరి నృసింహస్వామిదే కావడం తెలంగాణకు గర్వకారణమని కొనియాడారు. ఆలయ అభివృద్ధి, వైటీడీఏ ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సమీక్షించనున్న నేపథ్యంలో గురువారం మంత్రి సురేఖ సచివాలయంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు ఆలయ పనుల పురోగతిని మంత్రికి వివరించారు. ఇప్పటికే ఆలయం పరిసర ప్రాంతాల అభివృద్ధికి 1,241.36 ఎకరాలను సేకరించామని, మరో 101.10 ఎకరాల ఫైల్ కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉన్నదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 15 నుంచి విమాన గోపురానికి తాపడం పనులను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.