హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తప్పించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి రవి గుగులోతు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సుమంత్ కాంట్రాక్ట్ పద్ధతిలో మంత్రి సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. తొలుత ఆయన్ను ఏ డాది కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో నియమించి పీసీబీ నుంచి జీతం చెల్లిస్తున్నారు. ఆ గడువు ముగిసిన తర్వాత మరో ఏడాది పొడిగించారు. సుమంత్ అవినీతికి పాల్పడినట్టు ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తడంతో ‘నమస్తే తెలంగాణ’ సహా పలు పత్రికలు, మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ వర్గాల అంతర్గత విచారణ నివేదిక ఆధా రంగా పీసీబీ ఆయన్ను టర్మినేట్ చేసింది. కాగా మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఓఎస్డీ సుమంత్‌ను తొలగించినట్టు తెలిసింది.
సురేఖ పేషీలో సుమంత్ అత్యంత కీలకమట. అదే పేషీలో ప్రభుత్వ ఉద్యోగి అయిన మరో ఓఎస్డీ ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే సుమంత్ ఆయన్ను డమ్మీగా చేసి, అన్నీ తానై చక్రం తిప్పారు. ఐఏఎస్ అధికారులను సుమంత్ ఏమాత్రం ఖాతరు చేయకుండా వారిపైనే ఆధిపత్యం చెలాయిస్తారట. మంత్రి ఆమోదం కోసం ఏదైనా ఫైల్ వెళ్తే.. సుమంత్‌కు లక్ష సమర్పించుకోవాల్సిందేనట.
బదిలీలు, పోస్టింగ్‌లలో సుమంత్ వసూళ్ల గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. డబ్బుల కోసం వరంగల్‌లో కొందరు క్రషర్ యజమానులకు ధమ్కీ ఇవ్వడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల లొసుగులను ఆసరాగా చేసుకుని వారిని సైతం బెదిరించినట్టు సమాచారం. పైసా ఖర్చు చేయకపోయినా నెలకు రూ.10-15 లక్షల బిల్లులు వసూలు చేశారట. టీపొడి, చక్కెర, చాయ్, బిస్కట్ల బిల్లులే రూ. 4-5 లక్షలు ఉంటాయట. ఆయన రహస్య ప్రాంతానికి వెళ్లి పనులు చక్కబెడతారట. అటవీ శాఖలో ఫారెస్ట్ ఆఫీసర్లు, పెద్దసార్లు అంతా సుమంత్‌కు సలాం కొడతారట.
ఓఎస్డీ సుమంత్ టర్మినేషన్ వెనుక మంత్రి కొండా సురేఖను రాజకీయం గా దెబ్బకొట్టాలన్న కుట్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత మనుషులే ఆమెను టార్గెట్ చేశారన్న చర్చ నడుస్తున్నది.మంత్రులు కొండా, పొంగులేటి మధ్య విభేదాలు ఇటీవల రచ్చకెక్కాయి. ప్రస్తుతం వారి మధ్య ఫిర్యాదులు, లేఖల పంచాయితీ నడుస్తున్నది. పొంగులేటికి సీఎం రేవంత్‌రెడ్డి అండదండలు ఉండటంతో బీసీ అయిన కొండా సురేఖను దెబ్బతీసేంందుకే ఆమె ఓఎస్డీని ఉద్యోగం నుంచి తొలగించారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సురేఖను బలహీనపర్చాలని ఓ వర్గం ప్రయత్నిస్తున్నట్టు కొండా వర్గీయులు ఆరోపిస్తున్నారు.