హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజకీయాల్లో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సాగుతున్న రాజకీయ కుట్రలపై మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పూసగుచ్చినట్టు వివరించారని విశ్వసనీయ సమాచారం. తన కూతురు సుస్మితాపటేల్ చేసిన వ్యాఖ్యల మీద క్రమశిక్షణా కమిటీలో విచారణ జరుగుతున్న సమయంలోనే, కొందరు ఎమ్మెల్యేలు సీఎల్పీ వేదికగా తనపై విమర్శలు చేసిన విషయాన్ని ఆమె ఖర్గేకు వివరించినట్టు తెలిసింది.
ఆ 17 మంది ఎమ్మెల్యేల వెనుక ఉన్న అదృశ్యశక్తి ఎవరో సురేఖ బహిర్గతం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ ఏఐసీసీ మాజీ దూత దీపాదాస్ మున్షీ సహకారంతో బెంగళూరులో మంత్రి సురేఖ, ఖర్గేతో భేటీ అయినట్టు తెలిసింది. ఇద్దరి మధ్య దాదాపు గంటన్నరపాటు చర్చలు కొనసాగినట్టు సమాచారం. పార్టీలో కొందరు కీలక నేతలు ఉద్దేశపూర్వకంగానే తమను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇటీవల క్రమశిక్షణా కమిటీకి రాసిన లేఖ ప్రతులను ఆమె ఖర్గేకు అందజేసినట్టు సమాచారం.
భట్టి అపాయింట్మెంట్ నిరాకరణ
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి మాట్లాడి, ఈ సంక్షోభాన్ని చల్లార్చేందుకు కొండా సురేఖ భర్త కొండా మురళి ప్రయత్నం చేసినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భట్టి విక్రమార అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించినట్టు సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చకు దారితీసింది.