రేవంత్‌రెడ్డీ.. జెన్‌జీకి టిక్కెట్లిస్తా అనే నువ్వు, డైపర్లు వేసుకుంటేగానీ నడవలేని రేవూరికి మళ్లా పరకాల టికెట్ ఇస్తానంటవా? కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా ఎవరుండాల్నో నిర్ణయించాల్సింది అధిష్ఠానమే. అసలు ముందు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటవో? ఊడిపోతవో? అనుమానమే. నీ ప్రవర్తనను అధిష్ఠానం అన్నికోణాల్లో జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు మాకు సమాచారం ఉన్నది.
రేవంత్‌రెడ్డీ.. కండ్లు నెత్తికెక్కినయా? నీకు పీసీసీ ఇప్పించి తప్పు చేసినం. కొండా మురళినే తొక్కేద్దామని చూస్తవా? ఇప్పటికే నీ తమ్ముడి రూ.200 కోట్ల ముచ్చటనే చెప్పిన.. నా మీద కౌంటర్ ఇయ్యాలని చూస్తే మొత్తం బండారం బయటపెడుతా?
-కొండా సుస్మిత
వరంగల్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ముఖ్యమంత్రి అయితే.. కండ్లు నెత్తికి ఎక్కినయా రేవంత్‌రెడ్డీ?’ అని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రెండున్నరేండ్లలో రేవంత్‌రెడ్డి, ఆయన తమ్ముళ్లు రాష్ట్రం మీద పడి తినడం తప్ప ప్రజలకు ఏం చేశారు?’ అని నిలదీశారు. ‘రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్‌లా పరిస్థితి తయారైంది’ అని నిప్పులు చెరిగారు.
మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ శివారులో నిర్వహించిన కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో సుస్మితా పటేల్ పాల్గొన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మళ్లీ గెలిపించాలని చేసిన వ్యాఖ్యలపై సుస్మిత మండిపడ్డారు. వృద్ధుడు, డైపర్లు వేసుకోకుండా నడువలేని వ్యక్తికి టికెట్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. దమ్ముంటే పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని రాజీనామా చేయించి తనపై పోటీ చేయించి గెలిపించుకోవాలని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.
‘రేవంత్‌రెడ్డి ఆయన తమ్ముళ్లు రాష్ర్టాన్ని దోచుకుతింటున్నరు. సీఎం తమ్ముడి షెల్ కంపెనీకి రూ.200 కోట్ల ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసింది నిజం కాదా?’ అని సుస్మిత నిలదీశారు. ‘ఇప్పుడు నీ తమ్ముడి రూ.200 కోట్ల ముచ్చటే చెప్పిన.. నా మీద కౌంటర్ ఇయ్యాలని చూస్తే మొత్తం బండారం బయటపెడుతా?’ అని హెచ్చరించారు. వేం నరేందర్‌రెడ్డికి సలహాదారుడిగా పదవి కట్టబెడితే మూడేండ్లల్లో ఆయన ఏం సలహా ఇచ్చాడో, ఆ సలహాతో ప్రజలకేం సేవ చేశారో చెప్పాలని రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. వేం నరేందర్‌రెడ్డి ఇచ్చే సలహాలతోనే రాష్ట్రం ఆగమవుతున్నదని విమర్శించారు. వేం నరేందర్‌రెడ్డి సలహాతో మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, దీంతో కొత్తగా కొత్త ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఎక్కడ ఇవ్వాలో తెలియడం లేదని మండిపడ్డారు.
‘సీఎంగా రేవంత్‌రెడ్డి ఉంటాడో? ఊడిపోతడో? అనేది కొంచెం అనుమానంగా ఉన్నది’ అని సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రవర్తనను అధిష్ఠానం అన్నికోణాల్లో జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు తమకు సమాచారం ఉన్నదని చెప్పారు. నిజానికి తమ తల్లిదండ్రులు ఉత్తమ్‌కుమారెడ్డి పేరును ప్రతిపాదించాల్సి ఉండెనని, కానీ అన్నీ బాగా చేస్తాడని అప్పుడు అనుకుంటే ఇప్పుడేం చేయడం లేదని తెలిపారు.
రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడానికి కష్టపడిన తన తండ్రి కొండా మురళీధర్‌రావు, దయాసాగర్, షబ్బీర్‌అలీ వంటి నేతలను విస్మరించి, ఇప్పుడు వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ‘సీల్డ్ కవర్ సీఎం అనే విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుపెట్టుకోవాలి’ అని సూచించారు. ‘నిన్ను కూడా కొడంగల్‌లో ఒకసారి ప్రజలు ఓడగొట్టారు. వైఎస్ లాంటివాళ్లే పదేండ్లు సీఎంగా ఉంటానని చెప్పుకోలేదు. అట్లాంటిది నువు పదేండ్లు సీఎంగా ఉంటానని చెప్పుకుంటున్నవ్?’ అని విమర్శించారు. ‘నువు ఒకసారి ఒక మాట మాట్లాడుతవు? ఇంకోసారి మరో మాట మాట్లాడుతవు’ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని పరకాలలో గెలిపించాలని సీఎం చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

Konda Sushmita Patel 01
21 ఏండ్లకే ఎమ్మెల్యే కావాలని ఒకవైపు చెప్తూనే, మరోవైపు డైపర్లు వేసుకొనే వ్యక్తికి, అదికూడా రెండేండ్ల ముందే అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. సంగారెడ్డికి పోయినప్పుడు జగ్గారెడ్డికి టిక్కెట్‌పై అధిస్ఠానం చెప్తుందని అంటూనే, పరకాలలో రేవూరికి టికెట్ ఇస్తానని చెప్పటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానం అంటూ ఒకటి ఉంటుందని, టికెట్లు ఇవ్వడం అనేది పార్టీ పెద్దలు చూసుకుంటారనే విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరని సుస్మిత చెప్పారు. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్‌లా పాలన సాగుతున్నదని విమర్శించారు. అంతా పచ్చకాంగ్రెస్దే నడుస్తున్నదని, అచ్చకాంగ్రెస్ది అసలే నడువడం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ‘టీడీపీ నుంచి వచ్చినవాళ్లంటే ఎందుకు అంత ప్రేమ? మా కాంగ్రెస్ సభ్యులపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నావెందుకు?’ అని రేవంత్‌రెడ్డిని నిలదీశారు.
సీతాదయాకర్కు పదవి ఇస్తానని సీఎం హామీ ఇవ్వడంపై మండిపడ్డారు. ‘సీతాదయాకర్ది ఎక్కడ? ఎక్కడి కాంగ్రెస్?’ అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కొండా మురళి దగ్గరికి వచ్చి ‘మనకు 36 సీట్లు వచ్చినా, 38 సీట్లు ఇచ్చినా మొదట ఎమ్మెల్సీ ఇచ్చేది నీకే అని అన్నవా? లేదా? ప్రమాణం చేసి చెప్పాలి. ఇప్పుడెందుకు మాట మార్చావో, కొండా మురళికి పదవి ఎందుకు ఇవ్వలేదో, రాజకీయంగా ఎందుకు తొక్కదలచుకున్నావో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. బీసీలను అణచివేయటమే నీ విధానమా? అని ప్రశ్నించారు.
‘రెండేండ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పుడే అభ్యర్థిని ఎట్లా ప్రకటిస్తావ్?’ అని సీఎం రేవంత్‌రెడ్డిని సుస్మిత నిలదీశారు. 80 ఏండ్ల వృద్ధుడు, డైపర్లు వేసుకోనిదే నడవలేని ఒక నాయకుడి పేరును పరకాలకు అభ్యర్థిగా ప్రకటించారని మండిపడ్డారు. ‘రేవూరికి పరకాల తెలియదు.. పరకాలకు రేవూరి తెలియదు. అటువంటోన్ని అభ్యర్థిగా ప్రకటించి రెచ్చగొట్టావ్’ అని సీఎంపై నిప్పులు చెరిగారు. ‘రెండేండ్లకు ఎందుకు? దమ్ముంటే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఇప్పుడే రాజీనామా చేయమని చెప్పు. నువ్వు వచ్చి రేవూరికి కాన్వాసింగ్ చెయ్.
వంచనగిరిలో నాకు మూడంతస్తుల ఇల్లు ఉన్నది. దాన్ని నీకు ఇచ్చేస్తా.. అక్కడే ఉండి కాన్వాసింగ్ చెయ్. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ అభ్యర్థిని, లేదంటే ఇండిపెండెంట్‌గా నిలబడుతా. ఎవరు గెలుస్తరో చూద్దాం’ అని రేవంత్‌కు సవాల్ విసిరారు. ‘రేవంత్‌రెడ్డీ.. నువ్వుగానీ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి కానీ, వాళ్ల అయ్యగానీ, వాళ్ల తాతగానీ పరకాల నుంచి ఎవరు నిల్చున్నా ఎమ్మెల్యేగా గెలిచేది నేనే’ అని ప్రకటించారు.
‘కొండా మురళీ ఇలాఖకు వచ్చి రేవూరిని మళ్లీ గెలిపించమని చెప్పడంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆంతర్యం ఏమిటి?’ అని సుస్మిత ప్రశ్నించారు. ‘ఎందుకు మాతోని పెట్టుకుంటున్నవ్? ఎందుకు మా జోలికి వస్తున్నవ్?. మాకు ఊడిగం చేయడం రాదు. నువ్వూ.. నీ చుట్టూ తిరుగుతూ బ్రోకరిజం చేసేవాళ్లు చేసే పనుల వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతున్నయ్’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డా? లేక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డా? అనేది తెలియడం లేదని ఎద్దేవాచేశారు. హైదరాబాద్‌లో ఇండ్ల పంపిణీ సందర్భంగా అక్కడి ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటో పెట్టకుండా ఆయనను అవమానించారని, బీసీలంటే అంత చులకన ఎందుకని ప్రశ్నించారు. ‘నీతోపాటు ఉన్న పొంగు ఎక్కువసేపు పొంగదయా.. అది పోతది’ అని ఎద్దేవా చేశారు.