కరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం రేవంత్‌రెడ్డిపై ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. తనపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని గతంలో స్వయంగా ముఖ్యమంత్రే పలుమార్లు సీరియస్‌గా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సొంత పార్టీ మంత్రి కూతురే బహిరంగంగా ఆరోపణాస్ర్తాలు సంధించినా ఎవరూ స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నది. అసలు ముఖ్యమంత్రికి మంత్రుల మద్దతు లేదా? క్యాబినెట్లోనే ఆయనంటే అసంతృప్తి పెరుగుతున్నదా? సొంత పార్టీ నేతలే సీఎంను సమర్థించేందుకు వెనుకాడుతున్నారా? అని జోరుగా చర్చ జరుగుతున్నది. అదీగాక తన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తే రేవంత్‌రెడ్డి అన్ని వ్యవహారాలన్నీ బయటపెడ్తానంటూ సుస్మిత మరో హెచ్చరిక చేశారు. అందుకే ఒకవేళ మాట్లాడితే తమ జాతకాలు బయటకు వస్తాయోనని భయపడి మంత్రులు జోక్యం చేసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మౌనం కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతమా? లేక వివాదం మరింత ముదరకుండా పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వ్యూహమా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి పదవికి మాత్రమే విలువ ఇస్తున్నారా? వ్యక్తిగా రేవంత్‌రెడ్డికి మంత్రులు గౌరవం ఇవ్వడం లేదా? అన్న చర్చ కూడా నడుస్తున్నది.
2025 అక్టోబర్‌లో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని కొండా సురేఖ నివాసానికి వెళ్లిన సందర్భంలో సుస్మిత అక్కడ పోలీసులను అడ్డుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి తదితరులు తమ కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తన తల్లి సురేఖ బీసీ మంత్రి కావడంతోనే ఆమెను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తన తల్లిదండ్రులకు ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రతిపక్షాలు, ఇతరులు తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు తానే కౌంటర్ ఇవ్వాల్సి వస్తున్నదని, మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదని గత మార్చిలో సీఎల్పీ సమావేశంలో సీఎం అసంతృప్తి వ్యక్తంచేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తే తాను ప్రతి అంశానికీ స్పందించాల్సిన అవసరం ఉండదని, ఇకపై స్పందించాలని కొంత సీరియస్‌గానే చెప్పారట. అయినా తాజా ఘటనలో మంత్రుల మౌనంపై అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యమంత్రిపై ఇంతటి తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణంగా అధికార పార్టీ మంత్రులు, ముఖ్య నేతలు వెంటనే రంగంలోకి దిగి ఖండించడం పరిపాటి. కానీ, సుస్మిత విషయంలో ఇప్పటివరకు అలాంటి సామూహిక స్పందన కనిపించలేదు. దీనిపైనే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మంత్రులు కూడా అసంతృప్తిలోనే ఉన్నారని అందుకే కౌంటర్ ఇవ్వలేదని తెలుస్తున్నది. తాము చెప్పలేని చాలా విషయాలు సుస్మిత బయటపెట్టిందనే వెనక్కి తగ్గి ఉంటారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే మంత్రులు బహిరంగంగా స్పందించకపోయినా.. పార్టీ నాయకత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తున్నది. సుస్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసు జారీ అయింది. దీంతో వ్యక్తిగత వ్యాఖ్యలుగా మొదలైన వ్యవహారం, ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ అంశంగా మారింది. ఇదిలా ఉంటే సుస్మిత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సురేఖ, తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగతమని వివరణ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.