హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మీసం మెలేయడం చర్చనీయాంశంగా మారింది. బర్తరఫ్ వార్త వెలువడిన వెంటనే గురువారం హైదరాబాద్లోని తమ నివాసానికి పెద్దఎత్తున చేరుకున్న మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు, అనుచరుల ముందుకు వచ్చిన మురళి.. చిరునవ్వుతో కనిపించారు. మొదటి అంతస్తు బాలనీలోకి వచ్చిన మురళి.. అందరూ చూస్తుండగానే మీసం మెలేసి, ఇక వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలిచ్చారు. కొండా మురళి చేసిన ఈ సంజ్ఞకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రాజకీయంగా కక్షపూరిత చర్యలు చేపట్టినా తాము భయపడబోమని, తమ వర్గం బలం ఏందో నిరూపిస్తామన్న రీతిలో ఆయన వ్యవహరించారని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ పోరాటాన్ని ఎదురొనేందుకు సిద్ధమనే సంకేతాలిచ్చారని చెప్తున్నారు.
అన్ని దరిద్రాలు ఒక్కటై మాపై కుట్ర
అన్ని దరిద్రాలు ఒక్కటై తమపై కుట్రపూరితంగా రాజకీయ దాడులు చేశాయని, కానీ తాము దేనికీ భయపడేది లేదని కొండా మురళి పేర్కొన్నారు. సురేఖను మంత్రివర్గం నుంచి బర్త్ఫ్ చేసిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరూ తట్టుకోరు. ఈరోజు మేం ఎదుర్కొంటున్న పరిస్థితులు.. రేపు ఇంకెవరికి ఎదురవుతాయో’ అని వ్యాఖ్యానించారు. ‘మాకు పదవులు ఉన్నా లేకపోయినా, మా గౌరవం మాకు ఎప్పుడూ ఉంటుంది. ప్రతి విషయానికీ మేం వెంటనే స్పందించకపోవచ్చు. కానీ, జరుగుతున్న ప్రతి ఒక్క పరిణామాన్నీ లోతుగా గమనిస్తూనే ఉంటాం’ అని పేర్కొన్నారు. ఎంతటి కష్టాన్నైనా తట్టుకుంటాం. మొండిగా ఎదురెళ్తామని వ్యాఖ్యానించారు. మురళి వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి.