చౌటుప్పల్, సెప్టెంబర్ 22 : చౌటుప్పల్ మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయాన్ని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు ముట్టడించారు. మండలంలో రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డీఈని “రైతులకు రోజుకు ఎన్ని గంటలు విద్యుత్ అందిస్తున్నారో చెప్పండి” అని ప్రశ్నించారు. అయన నుండి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అక్కడ ఉన్న ఇతర విద్యుత్ కార్యాలయాలకు తాళాలు వేశారు. డీఈ కార్యాలయానికి తాళాలు వేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.