– యాదగిరిగుట్ట దేవాలయాన్ని అడ్డుగా పెట్టుకుని ఇష్టారీతిన వెంచర్లు
– అమ్ముకుందామంటే ప్లాట్స్ ఎక్కడో తెల్వని పరిస్థితి
– అమాయకులను మోసం చేసిన చరిత్ర ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యది
– నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ, సెప్టెంబర్ 22 : రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా ఉన్న బీర్ల అయిలయ్య వందల కోట్లకు ఎలా ఎదిగాడో ప్రజలందరికి తెలుసునని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణ కేంద్రంలోని సువర్ణ గార్డెన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసిన యాదగిరిగుట్ట దేవాలయాన్ని అడ్డుగా పెట్టుకుని చుట్టుపక్కల వందల ఎకరాల్లో ఇష్టారితిన వెంచర్లు చేసి అమాయకలను మోసం చేసిన చరిత్ర ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యది అన్నారు. ఆయన చేసిన వెంచర్లలో సామాన్య ప్రజలు లక్షలు వెచ్చించి మోసపోయినట్లు తెలిపారు. ఇపుడు అమ్ముకుందామంటే ప్లాట్స్ ఎక్కడో తెల్వని పరిస్థితి అన్నారు. మాసాయిపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 726లో 1,200 ఎకరాల భూమిని ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ప్లాట్లు చేసి విక్రయించారు. ఇక్కడ కొన్న వాళ్లకు ఏ ఒక్కరి కూడా ప్లాట్లు దొరికే పరిస్థితి లేదన్నారు. రాజాపేట మండలంలోని సర్వే నెంబర్ 32లో 200 ఎకరాలు ఇందులో కూడా ఎలాంటి అభివృద్ధి లేదు. అన్ని మ్యాపుల మీద చూపించి ప్లాట్లు చేసి నిరుపేదల డబ్బు దోచుకున్నడని దుయ్యబట్టారు.
తుర్కపల్లి మండలంలోని దత్తాయిపల్లి గ్రామం దగ్గర 322 సర్వే నెంబర్లు సాల్వో కంపెనీ యజమాని ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఇరువురు అన్నదమ్ముల పంచాయతీ విషయంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తలదూర్చి క్రషర్ మిషన్ తో పాటు 100 ఎకరాల భూమిని బెదిరించి తన అనుచరులపై రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. చెరువుల్లో అక్రమ మట్టి, ఇసుక దందా చేసి విచ్చలవిడిగా సంపాదించాడన్నారు. బీర్ల ఐలయ్యకు గతంలో మారుతీ 800 కారు ఉండేదని, ఈ రోజు రెండు ఇన్నోవాలు ఒక బీఎండబ్ల్యూ, రెండు మహేంద్ర కార్లు, నాలుగు హిటాచీలు, 10 టిప్పర్లు వీటితో పాటు మూడు కోట్లు విలువ చేసే డిఫెండర్ కారు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే అయినా మూడేండ్ల లోనే ఇవ్వన్నీ ఎలా వచ్చాయో ప్రజలకు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రేసిడెన్షియల్ సూట్ పక్కనే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ నుండి నెలనెల మామూళ్ల కోసం ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్లు నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారన్నారు. బొమ్మలరామారం, ఆత్మకూరు(ఎం) తదితర ప్రాంతాల్లో భూములు ఆక్రమించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. బీర్ల ఐలయ్య తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ సిద్ధం కావాలి.
అక్రమ దందాలు, రియల్ ఎస్టేట్ బ్రోకరిజం, మట్టి ఇసుక మాఫియాలను నడిపించే బీర్ల ఐలయ్యకు హరీశ్‌రావును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. హరీశ్ రావుపై బీర్ల ఐలయ్య విమర్శలు చేయడం అంటే సూర్యుడిపై ఉమ్ము వేసిన చెందమే అన్నారు. హరీశ్ రావు ఏంటో రాష్ట్ర ప్రజలకు, ఆలేరు ప్రజలకు కూడా తెలుసు అన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా హరీశ్ రావు చరిత్రలో నిలిచిపోయే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆలేరులో కూడా హరీశ్ రావు మంత్రిగా అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీతమ్మ కోరిక మేరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేశారన్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ఆలేరులో పారించడంలోనూ హరీశ్ రావు పాత్ర కీలకం అన్నారు. హరీశ్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి గా ఉన్న సమయంలో రూ.43.50 కోట్లతో 34 చెక్ డ్యామ్ ల నిర్మాణం, గుండాల మండలంలోని సుద్దాల గ్రామంలో బిక్కేరు వాగుపై రూ.14 కోట్లతో చెక్ డ్యామ్ తో కూడిన వంతెన నిర్మాణం, వైద్యారోగ్య శాఖ మంత్రిగా యాదగిరిగుట్టకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు. రూ. 84 కోట్లతో కళాశాల పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఆలేరు, యాదగిరిగుట్ట పట్టణాల్లో PHC లను 100 పడకల దవాఖానలుగా ఆఫ్ గ్రేడ్ చేస్తూ మంజూరు ఇచ్చినట్లు తెలిపారు. 13 పల్లె దవాఖానాలకు పక్కా భవనాల కోసం నిధులు ఇచ్చారని, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఆలేరుకే కాదు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్ రావు పాత్ర ఉందని కొనియాడారు. రాష్ట్రంలోనే అధికార పక్షానికి కొరకరాని కొయ్యగా హరీశ్ రావు మారడంతో ఆయన టార్గెట్ గా దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.

‘రియల్ ఎస్టేట్ బ్రోకర్ వందల కోట్లకు ఎలా ఎదిగింది ప్రజలకు తెలుసు’
వాస్తవంగా రాష్ట్రంలో ప్రజలు సాగునీరు లేక, కరెంటు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కృష్ణానది ప్రవహించి శ్రీశైలంలోకి నీళ్లు వచ్చినా, జూరాల నిండినా సాగునీళ్లు ఇవ్వడం లేదన్నారు. ఇక్కడనేమో ఎల్‌నినో పేరుతో తెలంగాణ సర్కార్ నీళ్లు లేవంటూ పొలాలను ఎండబెడుతుంది. అదే కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ కుప్పం వరకు 700 కిలోమీటర్లు తరలించి పంటకు నీళ్లిస్తుంది. ఏపీకి సాధ్యమైంది తెలంగాణకు ఎందుకు సాధ్యం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ప్రేమ లేదు. ఆది నుండి రైతు పథకాలకు ఎసరు పెట్టిందే కాంగ్రెస్ అన్నారు. రుణమాఫీ సగమే చేశారు. రైతుబంధు ఎగ్గొట్టారు. ఎరువులు ఇవ్వలేకపోతున్నారు. సాగునీళ్లు లేవు, పంటల బోనస్ ఎగ్గొట్టారు. ఇట్లా చూస్తే రైతుకు తీరని అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెసేదన్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభించిందే లేదు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పనులకే ఇప్పుడు రిబ్బన్లు కట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఫొజులు కొడుతున్నారన్నారు.
ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపినట్లు తెలిపారు. ఫామ్ హౌజ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వాళ్లు తిరిగేవన్నీ ఎప్పుడో బీఆర్ఎస్ నేతలు ఎన్నికలప్పుడే అఫిడవిట్లో చూపించిన ఆస్తులు అన్నారు. కొత్తగా ఏదో కనిపెట్టామంటూ వాళ్ల అనుకూల మీడియాతో కేసీఆర్, బీఆర్ఎస్ నేతల టార్గెట్‌గా దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఇప్పటికే తిరగబడుతున్నారు, త్వరలో కాంగ్రెస్ కార్యకర్తలే మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయన్నారు. నిన్న జూరాల వద్ద రైతుల తిరుగుబాటు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని కుప్పి గంతులు వేసిన ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన స్థాయి ఏంటో మర్చిపోయి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును విమర్శిస్తున్నట్లు, వారిని విమర్శిస్తే తన స్థాయి పెరుగుతుంది అనుకోవడం భ్రమ అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు. అలాంటి కేసీఆర్ ఫామ్ హౌస్ మీదకు, ఆయన చావు కోరి డప్పులతో వెళ్లి ముట్టడించే కార్యక్రమం చేపడుతారా అని ప్రశ్నించారు. తావ్వు కట్టుకున్న ఫామ్ హౌస్ అన్నాచెల్లెళ్ల మధ్య చిన్న గొడవ ఉందని చెప్పేసి తన దగ్గరికి వస్తే వాళ్లను బెదిరించి ఆ భూమిని లాక్కొని గెస్ట్ హౌస్ కట్టుకున్న చరిత్ర వీరేశంది అన్నారు. అలాంటి తనకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మీద విమర్శలు చేసే హక్కు లేదని గుర్తుంచుకోవాలన్నారు. వీరేశం బీఆర్ఎస్ శ్రేణుల ప్రైవేటు ఫామ్ హౌస్ ల మీదికి పదేపదే వెళ్తున్నారు, భవిష్యత్‌లో ఆయన ఫామ్ హౌస్ ను కూడా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ముట్టడించి తీరుతామని హెచ్చరించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం అని చిరుమర్తి పేర్కొన్నారు.