హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : యూనివర్సిటీలకు పరిశోధనలే వెన్నెముకలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ దండ అంజిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ద్వైమాసిక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. స్టార్టప్‌లు ప్రారంభించేలా ప్రోత్సహించి విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలకు సూచించారు. రీసెర్చ్ స్కాలర్లు ఉద్యాన పంటలపై అధునాతన పరిశోధనలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభావవంతమైన ఫలితాల కోసం శాస్త్రవేత్తలు పనిచేయాలని చెప్పారు. సమావేశంలో యూనివర్సిటీ అధికారులు, అసోసియేట్ డీన్స్ పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 25: కూలినాలీ చేసి ఇల్లు కొనుక్కుంటే.. ఓ మాజీ పోలీస్ అధికారి దొంగ కాగితా లు తెచ్చి బెదిరిస్తున్నాడు..కలెక్టరమ్మా మమ్మల్ని నువ్వే కాపాడాలని ఓ దివ్యాంగ వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన దివ్యాం గ వృద్ధురాలు కాటిపల్లి లక్ష్మి సోమవారం కలెక్టరేట్లో 2గంటలు వేచిఉన్నది. గమనించిన కలెక్టర్ పమేలా సత్పతి వృద్ధురాలిని మందలించింది. నోటమాట రాక వృద్ధురాలు సైగల ద్వారా తన ఆవేదనను వెలిబుచ్చింది. పక్కనే ఉన్న కుమారుడు, కోడళ్లను అడగడంతో వారు కలెక్టర్‌కు వివరాలు వెల్లడించారు. జమ్మికుంటలోని 465 /బీ/4 సర్వే నంబర్లో తమకున్న 6 గుంటల భూమి మాజీ పోలీస్ అధికారి ఏనుగు జయపాల్‌రెడ్డి తనపేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించగా, తాము నాలుగుసార్లు ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారి దృష్టికి చేరనీయడంలేదని వాపోయారు. దీంతో తాను ప్రత్యేకంగా పోలీస్ అధికారితో మాట్లాడి, చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌కు వారికి భరోసానిచ్చారు.