హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): జీవితాంతం స్వరాష్ట్ర సాధనే ఎజెండాగా దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జీవించారని మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళ్లర్పించి, ఆయన సేవలను నాయకులు స్మరించుకున్నారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశారని, మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగజీవి అని మహమూద్ అలీ పేర్కొన్నారు.
రాచరికపు పాలనకు వ్యతిరేకంగా పేదలను కొండా లక్ష్మణ్ బాపూజీ ఏకం చేశారని ఎమ్మెల్సీ ఎల్ రమణ తెలిపారు. బాపూజీ పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బాపూజీ తొలిసారి ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, తన తండ్రి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇద్దరూ సమకాలికులని ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెప్పారు.
మాజీ ఎంపీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జాజాల సురేందర్, భగత్, బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, నగేశ్, రాకేశ్, విప్లవ్‌కుమార్, వాసుదేవరెడ్డి, రాకేశ్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రచారి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, రామ్మూర్తి, నరేందర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కడారి స్వామియాదవ్ పాల్గొన్నారు.