Konatham Dileep | నిర్మల్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్‌ను ఏ విధంగానైనా కటకటాల వెనుకకు నెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం తాత్కాలికంగా విఫలమైంది. ఆయనపై ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో 15 కేసులు నమోదు చేసిన పోలీసులు ఏదో ఒక కేసులో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌కు అవకాశం లేకుండా ఆయనపై పలు సెక్షన్లు నమోదు చేస్తున్నట్టు బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఆరోపిస్తున్నది. ఒక కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయగానే మరో కేసులో ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న కొణతం దిలీప్‌ను నిర్మల్ రూరల్ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని నిర్మల్ తరలించారు.
ఈ కేసులో సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయగానే మరో పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ వేధింపులకు నిరసనగా కొణతం దిలీప్ బుధవారం సాయంత్రం కోర్టు ముందే నిరసనకు దిగారు. దీంతో ఆయనను పక్కనే ఉన్న రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నోటీసులందించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజావ్యతిరేక, అస్తవ్యస్త పాలనకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రజలకు వాస్తవాలు తెలిపే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోస్టులు పెడుతున్న కొణతం దిలీప్‌పై కాంగ్రెస్ సర్కారు పోలీసు కేసులతో పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 15 కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నదని విమర్శిస్తున్నాయి. దిలీప్‌పై బెయిల్‌కు అవకాశం లేకుండా పోలీసులు పలు సెక్షన్లను నమోదు చేసినప్పటికీ న్యాయస్థానాలు మాత్రం ఆ సెక్షన్లను పరిగణనలోకి తీసుకొని బెయిల్ మం జూరు చేసి న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెడుతున్నాయి.
కొణతం దిలీప్ అమెరికాలో తన తండ్రి స్మారకార్థం నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరై మంగళవారం రాత్రి స్వదేశానికి తిరిగి వచ్చారు. పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకొని అర్ధరాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్టు దిలీప్ కుటుంబసభ్యులకు తెలుపలేదు. సాయంత్రం వరకు ఆయనను స్టేషన్లోనే నిర్బంధించారు. ఈ సమాచారం తెలుసుకున్న హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఆయనపై పెట్టిన కేసుల వివరాలను అందించి, విచారణ పూర్తి చేసి స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెషన్స్ కోర్టులో పోలీసులు రిమాండ్ షీట్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలు జరిగిన అనంతరం సెషన్స్ కోర్టు జడ్జి భవిష్య కొణతం దిలీప్‌కు షరతులతో కూడిన బేయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు.
కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొణతం దిలీప్ అక్కడ చేరిన వారిని, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతలో కడెం పోలీసులు అక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వాల్సి ఉన్నదని, 40 కిలోమీటర్ల దూరంలోని పోలీస్‌స్టేషన్‌కు రావాలని దిలీప్‌ను ఆదేశించారు. తానున్న ప్రదేశంలోనే తనకు నోటీసులివ్వాలని దిలీప్ కోరారు. లేదు కడెం పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందేనని పోలీసులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ కొణతం దిలీప్ కోర్టు ఎదుటే నిరసనకు దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నిలిచారు. సెక్షన్ 41కింద నోటీసులు ఇంటి వద్ద గానీ, లేదా ఆ వ్యక్తి ఉన్న ప్రదేశంలోగానీ ఇవ్వవచ్చని, కానీ పోలీసులు స్టేషన్‌కు రావాలని చెప్పడం వేధించడమేనని మహిళా న్యాయవాది పేర్కొన్నారు. దీంతో పోలీసులు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నోటీసులు అందించారు.
కొణతం దిలీప్‌కు న్యాయ సహాయం అందించడంలో బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు చాకచక్యంగా వ్యవహరించారు. హైకోర్టు న్యాయవాదులైన లలితారెడ్డి, అమృత్‌రావు, అంబల్ల హరీశ్, విశ్వేష్, కిరణ్‌తో పాటు స్థానిక న్యాయవాదులు తోట సుమీత్, అజయ్ తదితరులు నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని స్థానిక నాయకులతో చర్చించారు. ముందుగా నిర్మల్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మూడు కేసుల్లో స్టేషన్ బెయిల్ సంపాదించగలిగారు. ఖానాపూర్ స్టేషన్లో నమోదైన కేసుపై సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసి వాదనలు వినిపించారు. వారి వాదనతో సంతృప్తి చెందిన జడ్జి దిలీప్‌కు బెయిల్ మంజూరు చేశారు.
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. హామీలను అమలు చేయాలని ప్రశ్నించినందుకు తమలాంటి వారిపై అక్రమ కేసులను బనాయిస్తున్నది’ అని బీఆర్ఎస్ సోష ల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ ఆరోపించారు. బెయిల్ మంజూరైన అనంతరం ఆయన కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు.