కోనరావుపేట, ఫిబ్రవరి 21 : ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పీహెచ్సీ వైద్యాధికారి వేణుమాధవ్ మంగళవారం తెలిపారు. ఈ పీహెచ్సీని గత డిసెంబర్ 26, 27వ తేదీల్లో జాతీయ నాణ్యతా ప్రమాణాల సభ్యులు దేవేంద్రకుమార్ బిట్టోరియా, అభిషేక్, సుభాష్ సందర్శించారు. రెండు రోజులపాటు పీహెచ్సీలో అందిస్తున్న సేవలను పరిశీలించారు.
ముఖ్యంగా రోగులకు ఆశ కార్యకర్తలు అందిస్తున్న సేవలు, పీహెచ్సీకి వచ్చే రోగుల వివరాల నమోదు, ప్రతి నెలా గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, రికార్డుల నమోదు, డెలివరీల సంఖ్య పెంచడం, పీహెచ్సీలో పరిశుభ్రత, చుట్టూ ఆవరణలో పచ్చదనంతోపాటు అన్ని రకాల వసతులను తనిఖీ చేశారు. దీంతో వైద్యులు, సిబ్బంది అన్ని విభాగాల్లో అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్రంలో 90.1 శాతం మార్కులు ఇస్తున్నట్టు మంగళవారం ప్రకటించగా, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ పీహెచ్సీ త్వరలో (ఎన్క్యూఏఎస్) నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికెట్ అందుకోనున్నది.