చేర్యాల, డిసెంబర్ 14 : భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి (Komuravelli Mallikarjuna) కల్యాణోత్సవం ఆదివారం ఆలయ తోటబావి ప్రాంగణం కల్యాణ వేదిక వద్ద వైభవంగా నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బర్దీపూర్ పీఠాధిపతి డాక్టర్ డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహాస్వామిజీ పర్యవేక్షణలో కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వేద పాఠశాల విద్యార్థుల శివకీర్తనలతో కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.
స్వామివారి తరఫున పడిగన్నగారి వంశస్తులు, అమ్మవార్ల తరఫున మహదేవుని వంశస్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం రుద్రాభిషేకం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. గర్భగుడిలో జరిగిన కల్యాణోత్సవంలో అమ్మవారి తరఫున మహాదేవుని భాస్కర్, స్వామివారి తరఫున పడిగన్నగారి ఆంజనేయులు దంపతులు పాల్గొన్నారు. వీరశైవ ఆగమ పండితులు, పురోహితులతో పాటు ఆగమ పాఠశాల వేదపండితులు, విద్యార్థుల ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మడపతి సాంబశివశర్మ, డాక్టర్ మహంతయ్యస్వామి వ్యా ఖ్యాతలుగా వ్యహరించారు. ఉదయం 5 గంటలకు ఆలయవర్గాలు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని వండి దృష్టికుంభం నిర్వహించా రు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హరీశ్, ఆర్జేసీ రామకృష్ణారావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
‘మల్లన్న’ సాక్షిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన
కొమురవెల్లి మల్లికార్జునస్వామి సాక్షిగా మంత్రి కొండా సురేఖ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కల్యాణోత్సవానికి పట్టువస్ర్తాలు సమర్పించేందుకు ఎన్నికల కమిషన్ మంత్రి సురేఖకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఈ మేరకు కల్యాణోత్సవానికి పట్టువస్ర్తాలను జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మంత్రి తీసుకొచ్చారు. వేదిక పైనే ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి కల్యాణోత్సవం ముగిసేవరకు కూర్చున్నారు. కల్యాణ వేదిక ముందే మీడియాతో ఆమె ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. అమ్మవార్లకు రెండు స్వర్ణ కిరీటాలు ఆర్డర్ ఇచ్చామని, బ్రహ్మోత్సవాలకు ముగిసే వరకు వస్తాయని చెప్పారు. వెండి తాపడంతో పల్లకీ తయారు చేయిస్తామని, కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని వెల్లడించారు.