చేర్యాల, జూన్ 23: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఉద్యోగుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యం లో ఆలయ ఉద్యోగుల్లో సఖ్యత కోసం ఈవో బాలాజీ ఆదివారం సమావేశమయ్యారు. ఏఈవో గంగా శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఏఈ అంజయ్య మధ్య మాటామాట పెరిగింది. ఏఈ అంజయ్య చెంపను ఏఈవో శ్రీనివాస్ చెల్లుమనిపించారు. అక్కడే ఉన్న ప్లంబర్ విజయ్ గొడవలో కలుగజేసుకున్నాడు. వెంటనే శ్రీనివాస్పైకి అంజయ్య కుర్చీ లేపారు. అక్కడే ఉన్న సహచర ఉద్యోగులు వారిద్దరినీ అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.