హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : సీనియర్ జర్నలిస్టు, సాక్షి టీవీలో వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలోని కొమ్మినేని ఇంటికి మఫ్టీలో వచ్చిన ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అమరావతి మహిళలను కించపర్చారనే ఆరోపణల నేపథ్యంలో గుంటూరు జిల్లా తళ్లూరు పోలీసుస్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది.
సాక్షి టీవీ చానెల్లో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. అరెస్టు సందర్భంగా తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని.. ముందస్తు నోటీసులు ఇచ్చారా? అని కొమ్మినేని పోలీసులను ప్రశ్నించారు. ఏపీ పోలీసులు కొమ్మినేనిని అరెస్టు చేసిన అనంతరం జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం కొమ్మినేనిని ఏపీకి తరలించారు. ఇదే కేసులో జర్నలిస్టు కృష్ణంరాజు కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు.