Komatireddy Venkat Reddy | ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాను సీఎం కావాలన్న కోరికపైనే కాదు.. సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. యువకులకు ఉద్యోగాలు ఇస్తే సంక్షేమ పథకాలు అవసరం లేదంటూ మాట్లాడారు. ‘మీ కుటుంబంలో మీకు రైతుబంధో, గొర్రెలో, చేపలో కాదు.. ఉద్యోగాలు ఇస్తే మీరు అమ్మానాన్నలను సాదుకోలేరా’ అంటూ ప్రశ్నించారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కావాలనుకున్న కోరికను మరోసారి బయటపెట్టుకున్నారు. మంగళవారం నల్లగొండ అసెంబ్లీ స్థానానికి కాం గ్రెస్ అభ్యర్థిగా వెంకట్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం క్లాక్‌టవర్ సెంటర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ.. నల్లగొండ నుంచి ఎప్పుడో ఓ సారి తాను సీఎం అవుతానని, అయితే.. ఆ విషయంలో తనకేం తొందర లేదని చెప్పారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు తాను సీఎం కావచ్చని వ్యాఖ్యానించారు.
సాగర్‌లో సీనియర్ నేత జానారెడ్డి ఈసారి పోటీ నుంచి తప్పుకొని కొడుకు జయవీర్‌రెడ్డిని బరిలోకి దింపా రు. ఆయనకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పా ల్గొని సీఎం కావాలన్న కోరికను జానారెడ్డి బయటపెట్టారు. ‘పదవుల రేసులో నేనెప్పుడూ లేను. పదవే రేస్‌లో ఉండి నన్ను అందుకుంటున్నది. నేను సీఎం కాదలుచుకుంటే’ అంటూనే ఎంపీగా లేకున్నా పీవీ నర్సింహారావు ప్రధాని కాలేదా? అలాగే తానూ సీఎం కాగలనని చెప్పుకొచ్చారు. ‘తెలుగు రాష్ర్టాల్లో నన్ను గౌరవిస్తున్నరు.. నన్ను సీఎంగా చూడాలని ప్రజలు కోరుతున్నరు. సీఎం కావాలన్న ప్రజల కోరిక నాకు తెల్వకుండానే తీరవచ్చు’ అంటూ జానారెడ్డి మనస్సులోని మాటను బయటపెట్టారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, హుజూర్నగర్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం సీఎం రేస్‌లో ఉన్నట్టు క్యాడర్‌తో చెప్పకనే చెప్తున్నారు. ఎమ్మెల్యేగా గట్టెక్కడం అంత సులభంగా లేకపోవడంతో ‘మీరు గెలిపిస్తే నేను సీఎం కూడా అవుతా’ అని ఓటర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ అభ్యర్థులు ముమ్మరం చేస్తున్నారు.