‘ఏంటన్నా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?’ అప్పటి వరకు కునికి పాట్లు పడుతున్న చేరికల కమిటీ అధ్యక్షుడు ఆ మాటలకు లేచి చూశాడు.
‘రా తమ్ముడూ… రా..! మా పార్టీ విధానాలు నచ్చి చేరడానికి వచ్చిన మీకు చేరికల కమిటీ అధ్యక్షుడిగా స్వాగతం పలుకుతున్నాను…’ అంటూ ఉత్సాహంగా భుజం తట్టాడు.
‘ఊరుకో అన్నా… నువ్వూ నీ జోకులు … నేను పార్టీలో చేరడానికి రావడం ఏమిటీ? మీరు పార్టీలో చేరక ముందు నుంచే నేను పువ్వు పార్టీలో ఉన్నాను. అంతే లే అన్న… నిన్న మొన్న వచ్చిన మీలాంటి వాళ్ళు మొదటి నుంచి ఉన్న మమ్మల్ని ఏం గుర్తు పడతారు.’
‘సారీ తమ్ముడూ గుర్తు పట్టలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేరికల కమిటీ అని పెట్టి, దానికి నన్ను అధ్యక్షుణ్ని చేశారు. అదేం ముహూర్తమో కమిటీ పెట్టక ముందు ఒకరో ఇద్దరో చోటా మోటా నాయకులు చేరే వారు. కమిటీ పెట్టాక పార్టీ నుంచి జారుకునే వారే కానీ, చేరే వారు కనిపించడం లేదు. ఎవరూ రాని షాప్‌లో కూర్చుంటే కునికి పాట్లు సహజమే కదా!
’‘ఔను పార్టీలో నువ్వు మొదటి నుంచి ఉన్నావు కదా … ఇక్కడ ఎవరూ ఎందుకు చేరడంలేదంటావ్ ?’
‘అది నాకు తెలిస్తే, లీడర్ అవుతాను కానీ క్యాడర్ ఎందుకు అవుతా?’
‘అదీ నిజమే … పోనీ మన కమిటీ యాక్టివ్ గా పని చేసేందుకు ఏదైనా ఐడియా ఇవ్వు ’
‘ఐడియా తరువాత అన్న… కోమటి రెడ్డి రాజ గోపాల్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి హస్తంలోకి వెళ్లారు … మీరంతా చాలా సార్లు మాట్లాడుకున్నారు కదా? అలా వెళ్లిపోవలసిన వారిలో మీరూ ఉండాలి కదా? మీరు పోలేదేమిటీ?’
‘అదేం ప్రశ్న తమ్మి … రాజ గోపాల్ ఎందుకు పోయాడు అని అడగాలి కానీ , నేనెందుకు పోలేదు అని అడుగుతున్నావు?’
‘సరే అదే ఎందుకో చెప్పండి …?’
‘కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలమాట జవదాటడు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కమలం తరఫున పోటీ చేయ్ అని ప్రజలు ముక్త కంఠంతో చెబితే అలానే చేశాడు . ప్రజలు ఓడించారు. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్… అని చెబితే అలానే చేస్తున్నాడు…’
‘అన్నోయ్ మీడియాకు కథలు చెప్పినట్టు నాకు చెబితే ఎలా …’
‘అన్నీ తెలిసి అడుగుతున్నావు తమ్ముడు. డిపాజిట్ పోతే తలెత్తుకొని బతకడం కష్టం. కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందని వెళ్ళాడు. నన్నూ రమ్మన్నాడు. సరే మన చేరికల కమిటీ కళకళలాడే ఐడియా ఏదన్నా ఇవ్వు’
‘అన్నా ఏ ప్రొడక్ట్ అయినా మార్కెట్లో నిలబడక పోతే పేరు మార్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. టీనోపాల్ కొత్త పేరు రాణీపాల్ అని మన చిన్నప్పుడు రేడియోలో వినిపించేది. అలానే మన కమిటీ పేరు మార్చాలి’‘
ఏం పేరు?’
‘జారుడు కమిటీ … పార్టీని వీడి వెళ్లే వాళ్లంతా జారుడు కమిటీకి వచ్చి పార్టీ నుంచి జారుకోవాలి అనే షరతు విధిస్తే… పార్టీ నుంచి జారుకునే వారితో మన కమిటీ కళకళలాడుతుంది.’
– మురళి