హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడం శాసనసభ లాబీల్లో చర్చకు దారితీసింది. మంగళవారం మధ్యాహ్నం కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డైనింగ్ హాలుకు వెళ్లారు. కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భోజనం చేస్తున్న సమయంలో అదే హాల్లోకి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మె ల్యే బాలూనాయక్ వచ్చారు. వారు కూడా భోజనం చేసిన తరువాత కేటీఆర్ కూర్చు న్న టేబుల్ వద్దకు చేరారు. అక్కడే బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా ఉన్నారు. భోజనాలు ముగిసిన తర్వాత రెండు గంటలకుపైగా కేటీఆర్, రాజగోపాల్‌రెడ్డి భేటీ కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు వీరి మధ్య చర్చ జరిగింది. భేటీ అనంతరం రాజగోపాల్‌రెడ్డి, కేటీఆర్, పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. చాలా సాధారణమైన భేటీ మాత్రమేనని, రాజకీయ ప్రాధాన్యం ఏమీలేదని చెప్పారు.
మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌కు పేరొస్తది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడారు. పదవి ఉన్నా, లేకపోయినా రాజగోపాల్‌రెడ్డికి ప్రజల్లో తగిన గౌరవం ఉన్నదని, ఉంటుందని, తానేమీ మంత్రి పదవి కోసం పాకులాడటంలేదని చెప్పా రు. తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్ఠానం గతంలోనే హామీ ఇచ్చిందని, ఇప్పుడేమి చేస్తుందో చూడాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తన లాంటి ఉద్యమకారుల సేవలు అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తనకెలాంటి ఇబ్బందీలేదని, సోమవారం సీఎం తనకు ఎదురుపడితే పలుకరించుకున్నామని చెప్పారు. తానేమీ ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కాలేదని స్పష్టంచేశారు. కేటీఆర్‌తో కూడా తాను సాధారణంగానే అన్ని విషయాలు చర్చించానని, ప్రత్యేకత ఏమీ లేదని అన్నారు.