నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి టార్గెట్‌గా పోస్టర్లు వెలిశాయి. ఫోన్ పే తరహాలో కాంట్రాక్టర్ పే పేరిట పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని చండూరు పట్టణంలో వెలిసిన ఈ పోస్టర్లలో.. రూ. 18 వేల కోట్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు BJP18THOUSANDCRORES అంటూ ట్రాన్సక్షన్ ఐడీని ఉంచారు. అలాగే రూ. 500 కోట్ల బోనస్ అంటూ ఫోన్ పే ట్రాన్సక్షన్ తరహాలో కాంట్రాక్టు పేరుతో వేలాది పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి.
రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం కొత్తేం కాదు. గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన అనంతరం కూడా ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘రూ.22 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం 13 ఏండ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీకి అమ్ముడుపోయిన నీచుడివి నువ్వు. ఈడీ, అక్రమ కేసులతో సోనియాగాంధీని వేధిస్తుంటే.. అమిత్‌షాతో బేరసారాలు ఆడిన దుర్మార్గుడు రాజగోపాల్‌రెడ్డి. మునుగోడు గడ్డ ఎప్పటికీ నిన్ను క్షమించదు’ అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ప్రచురించిన పోస్టర్లు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వెలిసిన విషయం విదితమే.