Raj Gopal Reddy | నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ‘ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే 16 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం చాలా బాధకరం. అది కూడా నెలో.. రెండు, మూడు నెలలో, ఆరు నెలలో కాదు… ఎంపీ ఎన్నికలై కూడా 10 నెలలు కావస్తున్నది. మంత్రివర్గ విస్తరణ చేస్తలేరు. కనీసం లోకల్‌బాడీ ఎన్నికలు కూడా పెట్టలేదు. గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా చెప్పుకుందామంటే సర్పంచులు లేరు. ఎంపీటీసీలు లేరు. జడ్పీటీసీలు లేరు. ఇవన్నీ మీ ఇష్టమన్న మాట వాస్తవం కావచ్చు. కానీ, ఎన్నాళ్లు నానబెడతారు? నాకు కూడా ఓపిక నశించిపోయింది. నేను కూడా ఈ రోజు నుంచి అడగడం మొదలుపెడుతున్నా.
బరాబర్ మంత్రి పదవి ఇవ్వాల్సిందే’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేల్చిన రాజకీయ బాంబు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర మంటలు రేపుతున్నది. రాజగోపాల్‌రెడ్డి వ్యూహాత్మకంగానే ఒకేసారి ప్రభుత్వ పెద్దలు, పార్టీ ముఖ్యులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారనే చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్న వేదికపై నుంచే తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే తాడో-పేడో తేల్చుకునేందుకు సిద్ధమనే విధంగా స్పష్టమైన సంకేతాలు పంపించారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కన్నేశారు. ఎంపీ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకొని వస్తే, తనకు మంత్రి పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చారని రాజగోపాల్‌రెడ్డి అనేకసార్లు చెప్తూ వచ్చారు. ఇటీవల రాజగోపాల్‌రెడ్డి… సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు ‘నీకు మంత్రి పదవి ఫైనల్ అయ్యింది. 3న ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండు’ అని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పినట్టు వార్తలొచ్చాయి.
దాంతో రాజగోపాల్‌రెడ్డి అనుచరులు సైతం ‘కాబోయే మంత్రి రాజన్న’ అంటూ సోషల్ మీడియాలో విస్తృంగా పోస్టులు పెట్టారు. ఇంతలోనే ఏమైందో ఏమో మొత్తానికే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఇందుకు కారణం రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి విషయంలో పీటముడి పడటమేనని భావిస్తున్నారు.
ఈనెల 3న మంత్రివర్గ విస్తరణ ఖాయం అనుకున్న నేపథ్యంలో అంతకుముందు కాంగ్రెస్ అధిష్ఠానం కీలక సమావేశం నిర్వహించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… రాహుల్‌గాంధీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ తదితర కీలక నేతలు పాల్గొన్నారు. రాజగోపాల్‌రెడ్డి పేరు చర్చకు రాగా ఆయనకు ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామనే హామీ ఇచ్చినట్టుగా రాష్ట్ర నేతలు ప్రస్తావించారు. ఎవరు హామీ ఇచ్చారని రాహుల్‌గాంధీ నేరుగా ప్రశ్నించగా, అప్పటి ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు హామీ ఇచ్చారని రాష్ట్ర నేతలు చెప్పినట్టు సమాచారం.
ఆయన ఎవరి అనుమతితో హామీ ఇచ్చారంటూ రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇప్పటికే అదే కుటుంబం నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉండగా రాజగోపాల్‌రెడ్డికి ఎలా హామీ ఇస్తారని నిలదీసినట్టు తెలిసింది. దీనిపై రాష్ట్ర ముఖ్యలు సర్దిచెప్పే ప్రయ త్నం చేయబోగా, రాజగోపాల్‌రెడ్డికి ఇవ్వాలనుకుంటే అన్న వెంకట్‌రెడ్డిని పక్కన పెట్టండి. ఇక కుటుంబంలో ఒక్కరికే మంత్రి పదవి. ఇందులో తేడా లేదని రాహుల్‌గాంధీ కరాఖండిగా తేల్చిచెప్పడంతో వారంతా మిన్నకుండి పోయినట్టు సమాచారం. ఇదే విషయం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం అలర్ట్ అయ్యారు.
ఈ పరిణామాలన్నింటినీ రాజగోపాల్‌రెడ్డికి నేరుగా చెప్పే సాహసం చేయలేక రాష్ట్ర ముఖ్యులు సీనియర్ నేత కే జానారెడ్డిని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న ఆయనతో ఉన్నట్టుండి వ్యూహాత్మకంగానే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ లేఖ రాయించారని సమాచారం. జానారెడ్డి స్వతహాగా ఈ లేఖ రాయలేదని, దీని వెనుక రాష్ట్ర కీలక నేతలు ఎవరో ఉన్నారని రాజగోపాల్‌రెడ్డి వర్గీయులు భావించారు. ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ర్టుడిగా మారారంటూ రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా తనకు మంత్రి పదవి రాకుండా ఆదినుంచీ అడ్డుపడుతున్నారని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నారు.
తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుపడటం కోసమే ఉత్తమ్ పద్మావతి పేరును తెరపైకి తెచ్చినట్టు రాజగోపాల్‌రెడ్డితోపాటు ఆయన వర్గీయులు భావిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కూడా తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయం పట్టుకున్నదనే చర్చ జరుగుతున్నది. దాంతో ఒకవైపు జానారెడ్డి, మరోవైపు ఇద్దరు మంత్రులు కలిసి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా అడ్డుపడుతున్నారని రాజగోపాల్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాడో-పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఒక్కసారిగా హాట్ కామెంట్స్ చేశారనే చర్చ జరుగుతున్నది.
మంత్రి పదవిపై చౌటుప్పల్, చండూరులో ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌లో మంటలు పుట్టించిన రాజగోపాల్‌రెడ్డి ఆ వెంటనే యూరప్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. వ్యూహాత్మకంగానే విదేశీ పర్యటనకు వెళ్లే ముందు అధిష్ఠానానికి ఒకరకంగా హెచ్చరిక చేశారని తెలుస్తున్నది. ఈ నెల 23న ఆయన విదేశీ పర్యటన నుంచి తిరిగి రానున్నారు.