Congress Govt | నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పొద్దున లేస్తే గత బీఆర్ఎస్ సర్కార్‌పై ఒంటి కాలుతో లేచే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తమ మధ్య ఆధిపత్య పోరులో సర్కారు సొమ్మును దుబారా చేస్తున్నారా? అంటే అందుకు వాళ్లు చేస్తున్న టూర్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అవసరం ఉన్న సమయంలోనో.. అత్యవసర సమయంలో హెలికాప్టర్ ప్రయాణాలు అంటే ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ చీటికిమాటికి హెలికాప్టర్లో రావటం కాంగ్రెస్ సర్కార్ పెద్దలు ఫ్యాషన్‌గా ఫీల్ అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మరో సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్ జర్నీ కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇదే అదనుగా మిగతా మంత్రులు ‘గాలి ప్రయాణాల’కు సై అంటుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చ బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెలికాప్టర్ ప్రయాణం రద్దుకు కారణమైనట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహంతో కోమటిరెడ్డికి అధికారులు హెలికాప్టర్ ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది.
సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ ప్రయాణం సాధారణమే. కానీ సీఎం కంటే తామే సీనియర్లం.. హోదా పక్కనపెడితే పాలన వ్యవహారాల్లో సైతం తామే అనుభవజ్ఞులం అనే ధోరణితో ఇతర మంత్రులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటివాళ్లు రేవంత్‌రెడ్డి తమకంటే ఎక్కువేంటన్న వైఖరిని ప్రదర్శిస్తున్నారు.
అందుకే రేవంత్ ఒక్కసారి హెలికాప్టర్ ఎక్కితే తాము రెండు సార్లు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. కొన్నిసార్లు గంటలో రోడ్డుమార్గంలో వెళ్లే కా ర్యక్రమానికీ హెలికాప్టర్ జర్నీకే మొగ్గు చూపుతుండటం చర్చకు దారితీసింది. ఈ మధ్య నల్లగొండ జిల్లాలో మంత్రుల పర్యటనలను పరిశీలిస్తే హెలికాప్టర్‌ను ఎలా వాడేస్తున్నారో అర్థం అవుతుంది. బుధవారం సొంత జిల్లా నల్లగొండ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక్కరే నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాతోపాటు మిర్యాలగూడలో పర్యటించాల్సి ఉన్నది.
ఈ పర్యటనకు హెలికాప్టర్లో వస్తున్నట్టు ముందుగా అధికార పర్యటన షెడ్యూల్ విడుదలైంది. వాస్తవంగా హైదరాబాద్ నుంచి బయల్దేరితే సరిగ్గా రోడ్డుమార్గంలో గంటన్నరలో ఇక్కడ ఉండవచ్చు. హాలియాలో గురుపూజోత్సవం, మిర్యాలగూడలో ఫ్లైఓవర్ల శంకుస్థాపనతో పాటు గురుపూజోత్సవ కార్యక్రమాలకు కోమటిరెడ్డి హాజరు కావాల్సి ఉన్నది. హెలికాప్టర్ వినియోగంపై విమర్శలు రావటంతో ప్రభుత్వ వర్గాల ద్వారా సీఎం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. దాంతో హెలికాప్టర్ ఇవ్వొద్దని సంబంధిత వర్గాలకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో కోమటిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. అప్పటికప్పుడు రోడ్డుమార్గంలో బయల్దేరిన కోమటిరెడ్డి.. హాలియా పర్యటనను రద్దు చేసుకుని నేరుగా మిర్యాలగూడకు చేరుకున్నారు.