పేదోళ్ల ఆస్తులు కాపాడాలి. వారి ఆస్తులు పెరగాలి. ఎకరం రూ. 3-4 కోట్లు ఉన్నది. అంత పరిహారం కట్టిస్తరా? అయినా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. రీజినల్ రింగ్ రోడ్డు సర్వే పనులను అడ్డుకోవాలి. తక్షణమే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలి. బాధితులకు అండగా ఉంటాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చేందుకు కృషి చేస్తా. అవసరమైతే అందర్నీ ఢిల్లీకి తీసుకెళ్లి గడ్కరీని కలిపిస్తా..
– 2022, సెప్టెంబర్ 26న ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల ధర్నాకు సంఘీభావం తెలిపిన సందర్భంలో అప్పటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ట్రిపుల్ ఆర్ కోసం దౌర్జన్యంగా సర్వేలు చేయం కరెక్ట్ కాదు. ప్రైవేట్ భూముల్లోంచి కాకుండా ప్రభుత్వ భూముల్లోంచి వెళ్లేలా అలైన్మెంట్ మార్చాలి. దళితులను ధనవంతులను చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు వారి భూములను లాక్కొని వేలం వేయడం ఏంటి?
-2022, అక్టోబర్ 13న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు
ట్రిపుల్ ఆర్ తెలంగాణకు మణిహారం. దీని ద్వారా పరిశ్రమలు వస్తయి. రీజినల్ రింగ్ రోడ్డు రాయగిరి అలైన్మెంట్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నం. త్వరలోనే మళ్లీ సర్వే చేయిస్తం. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ నిబంధనల ప్రకారం చేపడుతం. సూటబుల్ పరిహారం అందిస్తం. దీనిపై వారం తర్వాత నిర్ణయం తీసుకుంటం..
-2024, జనవరి 21న యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో సమీక్ష అనంతరం మీడియాతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ట్రిపుల్ ఆర్ రాయగిరి అలైన్మెంట్ మారుతుందా? మారదా? ఏడికి పోతుందనేది చెప్పం. తప్పకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తం. రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తం.. అవసరమైన చోట్ల మార్పులు చేర్పులపై చర్చిస్తం. ట్రిపుల్ ఆర్తో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది.
-2024 మార్చి 6న భువనగిరిలో జరిగిన ప్రెస్మీట్లో మంత్రి కోమటిరెడ్డి
‘రీజినల్ రింగ్ రోడ్డు పేరిట పంట భూములు ఎట్లా తీసుకుం టరు? మేం అధికారంలోకి రాగానే ట్రిపుల్ఆర్ను ఆపుతం’ అంటూ నాడు రైతుల్ని రెచ్చగొట్టిన కోమటిరెడ్డి ఇప్పుడదే ఆర్ఆర్ఆర్కు కొత్త గీతలు గీయిస్తున్నరు. అడిగే రైతులపై పోలీసులను ప్రయోగిస్తున్నరు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని నాడు చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే తెప్ప తగిలేసింది. రైతుల భూముల్ని గుంజుకుంటూ ఉల్టా కేసులు పెట్టిస్తున్నది. ఇదీ కాంగ్రెస్ ద్వంద్వనీతి! దగా వైఖరి!
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఉన్నది రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తరీఖా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌పై ఎన్నో ముచ్చట్లు చెప్పిన ఆయన.. అధికారంలోకి వచ్చాక బాధిత రైతులవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పైగా రోడ్లు, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉన్నా ఇసుమంతైన పట్టించుకోవడంలేదు. రైతులు తమ గోడును వెళ్లబోసుకొనేందుకు పదుల సార్లు హైదరాబాద్ వచ్చినా కనీసం సమయం ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారు. ఇటీవల ముట్టడికి పిలుపునిచ్చిన రైతులను అరెస్టు చేయించి. పోలీస్ స్టేషన్లో పెట్టించారంటే అన్నదాతలపై ఆయనకు ఏమేరకు ప్రేమ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ట్రిపుల్ ప్రాజెక్ట్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వరకు హైదరాబాద్ ఉత్తర భాగంలో తొలి విడత రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. 159 కిలోమీటర్ల మేర 100 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. యాదాద్రిలోని చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల పరిధిలోని 34 రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇక దక్షిణ భాగం పరిధిలో నారాయణపురం, నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్, మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ వెళ్తున్నది. ఆయా ప్రాంతాల్లో ఇటీవల సర్వే నంబర్లు ప్రకటించడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ట్రిపుల్ ఆర్‌పై కాంగ్రెస్ మొసలి కన్నీరు కార్చింది. బీఆర్ఎస్ను దోషిగా నిలబెట్టేందుకు నానాయాగీ చేసింది. అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని హామీల మీద హామీలు గుప్పించింది. నాడు భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉండటంతో సందర్భం వచ్చినప్పుడల్లా హంగామా చేశారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో స్వయంగా పాల్గొన్నారు. అలైన్మెంట్ మార్చాల్సిందేనని పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు ముచ్చట్నే ఎత్తడంలేదు.
హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో కోమటిరెడ్డిని కలిసేందుకు రైతులు పలు దఫాలుగా వెళ్లినా కనీసం సమయం ఇవ్వలేదు. చాంబర్లోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు నిరుడు అక్టోబర్‌లో గేట్ ఎదుట బైఠాయించి ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. అంతా సీఎం రేవంత్‌రెడ్డే చూస్తున్నారంటూ దాటవేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇటీవల నల్లగొండలో సైతం క్యాంప్ ఆఫీసుకు వచ్చిన రైతులను అరెస్టు చేయించి పోలీసు స్టేషన్లో పెట్టించారు.
ట్రిపుల్ ఆర్ భాగంగా రాయగిరి రైతులు భూములు కోల్పోనున్నారు. గతంలోనూ ఈ ప్రాంత రైతులు పలు సందర్భాల్లో తమ భూములు కోల్పోవాల్సి వచ్చింది. యాదగిరిగుట్ట విస్తరణ, హైటెన్షన్ వైర్లు, జాతీయ రహరారి నిర్మాణం సమయంలో అధిక ధరలు పలికే భూములను అప్పనంగా అప్పగించాల్సి వచ్చింది. ఈ సారి ఎలాగైనా భూములను ఇచ్చేది లేదని రాయగిరి రైతులు నాలుగేండ్లుగా ఉద్యమం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే మారుస్తామన్న కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఇక కాంగ్రెస్ వచ్చాక చౌటుప్పల్ వద్ద అలైన్మెంట్లో మార్పులు చేసింది. ఇక్కడ ఓ కంపెనీ కోసమే సర్కారు మార్పులు చేసిందనే విమర్శలున్నాయి. దీంతో రెండున్నర రెట్లు అధికంగా భూములను సేకరించాల్సి వస్తున్నది. సంస్థాన్ నారాయణపురం మండలంలోనూ మార్పులు చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమను నమ్మించి మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది రైతులు ఉద్యమ బాట పడుతుంటే కోమటిరెడ్డి నేత్రుత్వం వహిస్తున్న ఆర్అండ్బీ శాఖ, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. భూనిర్వాసితుల గోడును పెడచెవిని పెడుతున్నాయి. ట్రిపుల్ ఆర్‌లో భాగంగా ఇప్పటికే త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్లు విడుదల కాగా రాయగిరి రైతులు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. విశ్వప్రయత్నాలు చేసి వెకెట్ చేసేలా సర్కారు చర్యలు తీసుకున్నది. ఇందుకోసం అధికారులను మంత్రి హైదరాబాద్‌కు పిలిపించుకున్నారని, సమీక్షలో ఆదేశాలిచ్చారనే ప్రచారం ఉంది. అంతేకాకుండా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్16: ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ భూములు కోల్పోతున్న రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిమిర్యాల గ్రామం వద్ద నారాయణపురం నుండి చౌటుప్పల్ వెళ్లే రహదారి పై బైటయించి రాస్తారోకు చేశారు.ఈ సంధర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ పూర్తిగా వ్యవసాయ భూముల్లో నుండి వెళ్తున్న ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధుృతం చేస్తామని హెచ్చరించారు..ప్రభుత్వం స్పందించి పాత అలైన్మెంట్ ప్రకరమే ట్రిపుల్ ఆర్ నిర్మించాలని కోరారు.విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని రైతులకు సర్ధి చెప్పి అక్కడి నుండి పంపించి వేశారు.ఈ కార్యక్రమంలో భూ బాధితులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని కోమటిరెడ్డిని కలిసేందుకు ఎన్నిసార్లు వెళ్లినా మమ్మల్ని కలవలే. చేసేదేం లేక పొద్దున్నే ఒకసారి నేరుగా చాంబర్ దగ్గరికి వెళ్లినా లాభం లేకపోయింది. మంత్రి సమయం ఇవ్వకుండా కారులో వెళ్తుంటే బాధితులమంతా కలిసి ఆందోళన చేసినం. అయినా పట్టించుకోలే. కనీసం మా బాధలు కూడా వినకుంటే ఎట్లా? ఎన్నికల ముందు అలైన్మెంట్ మారుస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కిమ్మనకుండా ఉంటే సరైన పద్ధతేనా? కోట్ల విలువైన భూములు తీసుకొని లక్షలు ఇస్తమంటే ఏం చేయాలి?అలైన్మెంట్ మార్చాలి.. లేదంటే బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించాలి.
– చింతల దామోదర్ రెడ్డి, భూ నిర్వాసితుల ఐక్య వేదిక, చౌటుప్పల్