మోదీతో భేటీపై ఊహాగానాలు
హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాంటి అవకాశమే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకట్‌రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీని కలవడంతో ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తన నియోజకవర్గ అభివృద్ధిపైనే ప్రధానితో చర్చించినట్టు వెంకట్‌రెడ్డి చెప్పుకొంటున్నా.. రాజకీయమే ప్రధాన ఎజెండాగా వీరి సమావేశం జరిగిందని భావిస్తున్నారు. ఇటీవల ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరి, మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకట్‌రెడ్డికి కూడా కాంగ్రెస్‌లో ప్రాధాన్యం తగ్గింది. ఇటీవల ఏర్పాటుచేసిన కమిటీల్లోనూ అధిష్ఠానం ఆయనకు చోటు ఇవ్వలేదు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఆయనకు ఉన్న విబేధాలు పరాకాష్ఠకు చేరాయి. దీంతో ముహూర్తం చూసుకుని ఆయన బీజేపీలో చేరతారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.