హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల పెంపు తనకు తెలియకుండా జరిగిందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. గత 4 రోజులుగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో బిజీగా ఉండటంతో ఈసారి తన శాఖకు చెందిన అధికారులు టికెట్ రేట్లు పెంచారని చెప్పారు. శుక్రవారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. ఇకముందు ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధర లు పెంచేది లేదని స్పష్టం చేశారు.
పెద్ద సినిమాల నిర్మాణ బడ్జెట్ను భారీగా పెంచి, హీరోలకు రూ.200, రూ.300 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని ఎవరు చెప్పారు? ఆ భారాన్ని ప్రేక్షకులపై మో పడం ఏమిటి? సినిమా టికెట్ ధరలను, థియేటర్లలో కూల్డ్రింక్స్, ఆహార పదార్థాల ధరలను ఇష్టమొచ్చినట్టు దారుణంగా రూ.600, రూ.1,000 పెంచితే ఎలా? పేద, మధ్యతరగతి ప్రజలు సి నిమా చూసేదెలా? అంటూ మంత్రి ఆ గ్రహం వ్యక్తం చేశారు. ‘మాది పేదల ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం. ఇందిర మ్మ రాజ్యం. ఇక ముందు టికెట్ ధరల ను పెంచే ప్రసక్తే లేదు. తెలంగాణలో సి నిమా టికెట్ రేట్లు పెంచాలంటూ ఇకపై నిర్మాతలు, దర్శకులు, నటులెవరూ మమ్మల్ని కోరవద్దు. ఒకవేళ కోరినా పెంచే ప్రసక్తే లేదు’ అని తేల్చిచెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు చెబితేనే తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి ‘అఖండ-2’ టికెట్ రేట్లు పెంచారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.