నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన తన అనుచరులను చల్లార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది. తక్షణమే పున్న కైలాశ్ నేతను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎంకు రాసిన లేఖలో కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయడం గమనార్హం. పున్న కైలాశ్ నేత అకారణంగా తనను, తన కుటుంబసభ్యులను, తన తల్లిదండ్రులను పరుషపదజాలంతో మీడియా ముందు దూషించారని ఆ లేఖలో పేర్కొన్నారు. కైలాశ్ తిట్లు, దూషణలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో తమ కుటుంబం మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురైందని ప్రస్తావించారు. కైలాశ్ నేత దూషణలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
తక్షణమే అతనిపై పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు చేపడుతూ డీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కైలాశ్ నేత స్థానంలో మరొకరికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని సీఎంను విజ్ఞప్తి చేశారు. ఇంతటితో ఆగకుండా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు మరో లేఖ రాస్తూ.. తనను, తన కుటుంబాన్ని దూషించిన పున్న కైలాస్ నేతపై తక్షణమే పోలీసు కేసు నమోదుచేయాలని ఫిర్యాదు చేశారు. మంత్రి కోమటిరెడ్డి లేఖలతో కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది. మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి పరిస్థితి ఏమిటన్న చర్చ కాంగ్రెస్ నేతల్లో వినిపించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన మూడు రోజుల అనంతరం మంత్రి కోమటిరెడ్డి స్పందించడం చర్చనీయాంశంగా మారింది. డీసీసీ అధ్యక్ష పదవిని మంత్రి కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు గుమ్ముల మోహన్‌రెడ్డి ఆశించారు.
అయితే, అనూహ్యంగా పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన పున్న కైలాశ్ నేతను అధ్యక్ష పదవి వరించింది. దీంతో మర్నాడే గుమ్ముల మోహన్‌రెడ్డితోపాటు మంత్రి కీలక అనుచరులైన బుర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు కోమటిరెడ్డి క్యాంపు ఆఫీసులోనే ప్రెస్‌మీట్ పెట్టి బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఆ రోజు నుంచి మంత్రి కోమటిరెడ్డిపై ఆయన ప్రధాన అనుచరులంతా గుస్సా చేస్తున్నారు. పైగా పున్న కైలాశ్ నేత గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తిట్టిన వీడియోలను, సోషల్‌మీడియాలో వైరల్ అయిన క్లిప్పులను కోమటిరెడ్డి వాట్సాప్ నంబర్‌కు షేర్ చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు మంత్రి నల్లగొండకు వస్తే పెద్దగా స్పందించవద్దని కూడా నిర్ణయించుకున్నట్టు తెలిసింది.