Kollapur | కొల్లాపూర్, జులై 18 : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలులో జరిగిన సీఎం కార్యక్రమానికి కొంతమంది మహిళలకు, చిన్నారులకు కూలి ఇస్తామని తీసుకొని వచ్చి కూడు కూడా పెట్టలేదని బాధిత మహిళలు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం కొల్లాపూర్ పట్టణంలోని మొబైల్ క్యాంటీన్ వద్ద ఆకలితో తల్లడిల్లుతున్న చిన్నారులను మహిళలను నమస్తే తెలంగాణ ఆరా తీసింది. సీఎం కార్యక్రమంలో కోలాటం వేసేందుకు పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామం నుంచి అధికార పార్టీ నాయకులు మీటింగ్ వద్దకు తీసుకొని వచ్చారు. కానీ మధ్యాహ్నం భోజనం పెట్టించలేదన్నారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని వారు వాపోయారు. చిన్నారులు ఆకలితో అలమటించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.
డ్యూటీ పోలీసుల అవస్థలు…
సీఎం బహిరంగ సభకు బందోబస్తుకు వచ్చిన వచ్చిన పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్యూటీ పోలీసులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో అవస్థలు పడ్డారు. గురువారం రాత్రి నుంచి ఏకధాటిగా శుక్రవారం మధ్యాహ్నం వరకు వర్షం పడటంతో వర్షంలోనే డ్యూటీలు చేస్తూ ప్రజాసంఘాల నాయకులను వివిధ పార్టీల నాయకులను జర్నలిస్టులను అరెస్టు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో బహిరంగ సభ ప్రాంగణంలో చిన్నచిన్న ప్యాకెట్లుల్లో అందించిన నాసిరకం భోజనం తిని అసహనం వ్యక్తం చేశారు.