వేములవాడ టౌన్, మే 31: వేములవాడలోని రాజన్న ఆలయ గోశాలను దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్లు శ్రీనివారావు, కృష్ణప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేములవాడ శివారులోని తిప్పాపురంలో గల ఆలయ గోశాల పరిసరాలు, సంరక్షణకు చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోడెలు అనారోగ్యంతో మృతిచెందుతున్నాయనే విషయం తెలియడంతో దేవాదాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు పరిశీలనకు వచ్చినట్టు తెలిపారు. ఇక్కడి పరిస్థితులు, కోడెలు ఉన్న స్థలం, వాటి సంరక్షణ తీరుపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. కోడెల సంరక్షణపై ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వారి వెంట ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్, ఆలయ సిబ్బంది ఉన్నారు.
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి తిప్పాపురంలోని గోశాలలో కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధచూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన గోశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోడెలకు అందిస్తున్న మేత, ఇతర పదార్థాల నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అకాల వర్షాలు, అనారోగ్య కారణాలతో 8 కోడెలు మృత్యువాతపడినట్టు తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు. పశు వైద్యాధికారులు కోడెలకు నిరంతరం వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. కోడెల సంరక్షణను మరింత బాధ్యతగా చూసుకోవాలని, సరిపడా దాణా, పచ్చగడ్డి పెట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.