హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): కొడంగల్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ప్రఖ్యాత ఎల్అండ్టీ, నాగార్జున కంపెనీలను కాదని.. మేఘా ఇంజినీరింగ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఏ ప్రాతిపదికన కట్టబెట్టారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘క్విడ్‌ప్రోకో కింద మీకు దక్కిన వాటా ఎంత?’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం బక్క జడ్సన్ మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్ ఎత్తిపోతల పనులను మేఘా, రాఘవ కంపెనీలకు కట్టబెట్టడం వెనుక రూ.2వేల కోట్ల స్కాం ఉన్నదని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంపై తానిచ్చిన ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎల్అండ్టీ, నాగార్జున కంపెనీలను ఏ లెక్కన తిరస్కరించారని ప్రశ్నించారు. మేఘా కంపెనీ నిర్లక్ష్యంతోనే సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలిందని, ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులు నివేదిక ఇచ్చినా పనులు అప్పగించారని తెలిపారు. క్విడ్‌ప్రోకోతో దొరికిన రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలన్నారు. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.