ఊటూర్/మక్తల్, జూలై 26 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ ములు కోల్పోతున్న తమకు న్యాయమైన పరిహారం అందించాలని భూనిర్వాసితులు డి మాండ్ చేశారు. నిర్వాసితుల సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూరు తహసీల్దార్ కార్యాల యం ఎదుట రైతులు నిరసన చేపట్టారు. అంతకుముందు ప్లకార్డులతో ర్యాలీగా వెళ్లిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది.
ప్రతిఘటించిన రైతులు కార్యాలయం ప్రహరీలోకి ప్రవేశించి ధర్నా నిర్వహించారు. మక్తల్ మండలం కాచ్వార్, కాట్రేవుపల్లి, ఎర్నాగానిపల్లి భూనిర్వాసితులు మక్తల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, మక్తల్ మండల అధ్యక్షుడు మాల నర్సింహులు, కార్యదర్శి కేశవులు మాట్లాడుతూ.. ఎకరాకు రూ.60 లక్షలు పరిహారం ఇవ్వాలని, లేకుంటే ప్రాజెక్టుకు భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అనంతరం రెండు మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.