ఊట్కూర్, ఫిబ్రవరి 5 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల సర్వేకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూరు రిజర్వాయర్ నుంచి ఊట్కూర్ పెద్ద చెరువు మీదుగా పేరపళ్ల జయమ్మ చెరువు నుంచి కొడంగల్‌కు 7 టీఎంసీల సాగునీటిని అందించేలా చేపట్టిన ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1,200 కోట్లు కేటాయించి మేగా ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించింది. బుధవారం సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఊట్కూర్ మండలం బాపురం, తిప్రాస్‌పల్లి శివారు రైతుల వ్యవసాయ పొలాల్లో ఇరిగేషన్ డీఈ కేతన్‌కుమార్, ఏఈఈ వెంకటప్ప, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకారంతో ఓపెన్ కెనాల్, పంప్‌హౌస్, సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం సర్వే నిర్వహణకు సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న ఇరు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పొలాల వద్దకు చేరుకున్నారు. సీఎం సొంత జిల్లాలోనే తమ పొలాలకు భద్రత లేకుండా పోయిందని అధికారులను నిలదీశారు. ప్రాణాలు పోయినా భూములు ప్రాజెక్టులో పోనిచ్చేది లేదని చెప్పారు. ఇరిగేషన్ అధికారులను రైతులు, బీఆర్ఎస్ నేతలు అడ్డుకుని వారి వాహనాన్ని ఊరి పొలిమేర నుంచి దాటించారు. స్థానిక ఎమ్మెల్యే, సీఎం స్పందించి భూ సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కోరారు.