మక్తల్, ఆగస్టు 14 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూనిర్వాసితులపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి, కర్నాగానిపల్లి, కాచ్‌వార్‌కు చెందిన నిర్వాసిత రైతులు కాచ్వార్ నుంచి మక్తల్ తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా బయలుదేరారు. అయితే అనుమతులు లేవంటూ కాచ్వార్ వద్ద మక్తల్ సీఐ రాంలాల్, ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి అడ్డుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు రైతులను కదలనీయకుండా నేషనల్ హైవే అధికారులు ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నంచేశారు. తర్వాత డీఎస్పీ లింగయ్య అనుమతితో రైతులు పాదయాత్ర ప్రారంభించి 7 కిలోమీటర్ల దూరంలోని మక్తల్‌కు చేరుకున్నారు. ఈ యాత్రకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గాన్ని ఎండబెట్టి కొడంగల్‌కు నీటిని తరలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బలవంతపు భూసేకరణ నిలిపివేయాలన్నారు. ఫార్మా సిటీకి ఇచ్చినట్టుగానే ఇక్కడి రైతులకు కూడా పరిహారం అందించాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టంచేశారు.